ఖమ్మం, అక్టోబర్ 22: తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడిచి, పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని ఓ కల్యాణ మండపంలో కార్పొరేటర్ రాపర్తి శరత్ అధ్యక్షతన నిర్వహించిన అత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. 1996లో ఎన్టీఆర్ రాజకీయ సంక్షోభంలో ఉన్నారని, నాడు ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన వారిలో తుమ్మల లేరా అని ప్రశ్నించారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. మంత్రి పదవి ఇచ్చి సుముచిత స్థానం ఇచ్చినా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారని ధ్వజమెత్తారు. ఖమ్మం నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందో.. లేదో.. తుమ్మల రియల్టర్స్, బిల్డర్స్‌ను ఆరా తీయాలని హితవు పలికారు. అవినీతి అనే మాటే లేకుండా రూ.3,500 కోట్లతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తే, తుమ్మలకు ఆ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మంత్రిగా తన కారెక్టర్‌ను కాపాడుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నానని, రాజకీయపరంగా విమర్శిస్తే తాను సహిస్తానని, కానీ తుమ్మల హీనస్థితికి దిగజారి తనపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
తుమ్మలకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారో చెప్పి ఓట్లు అభ్యర్థించాలన్నారు. అంతేగానీ చిల్లర రాజకీయాలకు పాల్పడడం సబబు కాదన్నారు. తుమ్మల పదవులు అనుభవించినప్పుడు ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా.. అని మంత్రి ప్రశ్నించారు. తుమ్మల ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని, సమస్య పరిష్కారానికి తుమ్మల ఏ మార్గం చూపించారో ప్రజలకు తెలియజేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, తాను మంత్రి అయ్యాకే చొరవ తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నామన్నారు. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మాన్ని చిన్నచూపు చూశారన్నారు. నాడు నగరంలో 25 వేల నల్లా కనెక్షన్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 75 వేలకు పెరిగిందన్నారు. నాడు నగరం అన్నిరంగాల్లో వెనుకబడి ఉండేదన్నారు. ఇప్పుడు నగరంలో ప్రతి డివిజన్లో పార్క్‌లు, మరుగుదొడ్లు, ఓపెన్ జిమ్‌లు, క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అవసరమైన ప్రతిచోటా రోడ్లు, మురుగు కాలువలు నిర్మించామన్నారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు మేకల భిక్షమయ్య, పగడాల నాగరాజు, జకుల లక్ష్మయ్య, నార్నే ప్రసాద్, పాల నాగేశ్వరరావు, చింతల మల్లికార్జున్, సూరపనేని బాబూరావు, లింగబోయిన సతీశ్ ఉన్నారు.