ఖమ్మం రూరల్, జూన్ 23: అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, రేషన్‌కార్డులు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, రేషన్ కార్డులను తొలగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వమని అన్నారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కైకొండాయిగూడెం, టీఎన్జీవోస్కాలనీ, సాయిగణేశ్‌నగర్, సాయిప్రభాత్‌నగర్, నాయుడుపేట, ఆరెంపుల గ్రామాల్లో ఆదివారం పర్యటించిన ఆయన.. ఆయా గ్రామాల ప్రజల నుంచి స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిలోపు గ్రామాల్లోని ప్రతీ వీధిలో సీసీ రోడ్లు, సైడు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. మూడేళ్లలోపు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. అనంతరం మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. జూలై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల్లో పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. అధికారులు ఆర్డీవో గణేశ్, ఎంపీవో రాజారావు, ఐబీ ఈఈ వెంకటేశ్వర్లు, ఎంఈవో శ్యాంసన్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.