ఖమ్మం రూరల్, అక్టోబర్ 9 : ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది.
ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుతో కలిసి మంత్రి పొంగులేటి 36 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరిగే విధంగా చూస్తామని అన్నారు. కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో గణేశ్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీవో ఎస్.కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, అక్టోబర్ 9 : డంపింగ్ యార్డు వద్ద పేరుకుపోయిన చెత్తను డిస్పోజల్ చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటో డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.1.15 కోట్ల వ్యయంతో చేపట్టిన డంపింగ్ యార్డు అప్రోచ్ ఇంటర్నల్ నిర్మాణ పనులకు ఎంపీ రఘురాంరెడ్డి, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డంపింగ్ యార్డులో పెద్ద ఎత్తున చెత్తను డంపు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు చెత్తను డిస్పోజ్ చేయాలన్నారు. యార్డు వద్ద వేసిన చెత్తకు సంబంధించి ప్రణాళికలు తప్పనిసరిగా ఉండాలని, లేదంటే స్థానిక ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్డీవో గణేశ్, అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి తదితరులు పాల్గొన్నారు.