కూసుమంచి(నేలకొండపల్లి), ఆగస్టు 4: రైతు రుణమాఫీ విషయంలో అనుమానాలకు తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికీ మాఫీ జరిగేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలను నేరవేరుస్తామని, పేదలే అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమాలకు అందరి దీవెనలు కావాలని కోరారు. గువ్వలగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్‌ను ప్రారంభించారు. 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, చెన్నారంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
నెలాఖరులోగా
రాష్ట్రంలోని ప్రతి నియోజకర్గానికి 3,500 ఇండ్ల వంతున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేస్తాన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా వైద్యాధికారి మాలతి, ఆర్డీవో గణేశ్, క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి, ఎంపీపీ వజ్జా రమ్య , నాయకులు శాఖమూరి రమేశ్, వెన్నెపూజల సతారాములు, నెల్లూరి భద్రయ్య, యోనిక జానికి రామయ్య, జెర్రిపోతుల అంజి పాల్గొన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే సంబంధిత లబ్ధ్దిదారుడికి డబ్బులు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రూ.84.50 లక్షల విలువ చెసే 201 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.