ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 5 : మున్నేరు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరుణగిరి, జలగంనగర్, పెద్దతండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు.
కలియతిరుగుతూ ఇళ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫైరింజన్ల సహాయంతో ఇళ్లలోని బురదను శుభ్రం చేయాలన్నారు. అధికారులు సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, పుస్తకాలు, వస్తు సామగ్రి దెబ్బతిన్న వారికి న్యాయం చేస్తామన్నారు.
తడిసిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందజేస్తామని, విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతు వెంటనే చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మోటర్ సైకిల్‌పై కాలనీల్లో తిరుగుతూ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసుదన్‌నాయక్, ఎంపీడీవో ఎస్.కుమార్, మద్దులపల్లి ఏఎంసీ చైర్మన్ బి.హరినాథబాబు తదితరులు పాల్గొన్నారు.