ఖమ్మం, జూన్ 30: ఖమ్మం కార్పొరేషన్లో కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. 55వ డివిజన్ బైపాస్ రోడ్డులో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, వెంకటేశ్వరచారి, వెగినాటి మధు, యుగందర్, ప్రవీణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.