మధిర, జూన్ 23 : మధిర మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర స్థానిక బోడెపూడి భవనం నందు మధిర పట్టణ కమిటీ, శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తల సమావేశం మండవ ఫణీంద్ర కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. మధిర మున్సిపాలిటీలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు తెలిపారు.
మధిరలో కోట్ల రూపాయలతో వంద పడకల ఆస్పత్రిని నిర్మించి దానిని ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మధిర నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాలంలో మాత్రమే పేదలకు ఇండ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. మధిర నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలపై సీపీఎం పార్టీ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి పడకండి మురళి, జిల్లా కమిటీ సభ్యుడు శీలం నరసింహారావు, పట్టణ కమిటీ సభ్యులు పాపినేని రామ నరసయ్య, పుచ్చకాయల కిశోర్, ఫాతిమా బేగం, నాయకులు పెంటి వెంకటరావు, సిద్దావలి, తేలపోలు రాధాకృష్ణ, వెంకట్రావు పాల్గొన్నారు.