ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మైనింగ్ విస్తరించి ఉంది. ఐరన్‌ఓర్, బొగ్గు వంటి పెద్దతరహా ఖనిజాలతోపాటు బైరటీస్, కోరండం, డోలమైట్, మైకా, కార్టజ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, స్టోన్ అండ్ మెటల్, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలు అందుబాటులో ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలో ఐరన్ఓ ర్ను లీజు , సత్తుపల్లి మండలంలో బొగ్గు నిక్షేపాలను సింగరేణి ఆధ్వర్యంలో వెలికితీస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,983 హెక్టార్లలో చిన్న, పెద్దతరహా క్వారీలు నిర్వహిస్తున్నారు. క్వారీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా గనులశాఖ నుంచి అనుమతు లిస్తున్నది. ఈ నూతన విధానంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంబురపడుతున్నారు. ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా పెరిగింది. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఖాతాలో 2022-23 సంవత్సరానికి గాను రూ.270 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు మైనింగ్ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపుతూ అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు.
– మామిళ్లగూడెం, జూలై 9
మామిళ్లగూడెం, జూలై 9 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మైనింగ్ రంగంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు.తద్వారా మైనింగ్‌శాఖకు ఆదాయమూ పెరిగింది.
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట..
ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మైనింగ్ విస్తరించి ఉన్నది. చిన్న, మధ్యతరగతి ఖనిజాలు వెలికితీయడానికి క్వారీలకు గనులశాఖ అనుమతులు ఇస్తున్నది. నూతన మైనింగ్ విధానంలో ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇస్తుండడం విశేషం. వెలికితీసిన ఖనిజాలను అక్రమంగా రవాణా చేయకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియాపై జిల్లా అధికారులు కేసులు నమోదు చేసి జరిమానాలను విధిస్తున్నారు. జిల్లాలో బైరటీస్, కోరండం, డోలమైట్, మైకా, కార్టజ్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, స్టోన్ అండ్ మెటల్, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలు అందుబాటులో ఉన్నాయి. పెద్దతరహా ఖనిజాలు ఐరన్ఓర్లో నేలకొండపల్లి మండలంలో లీజు రూపంలో మైనింగ్ నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి మండలంలోని బొగ్గు నిక్షేపాలను సింగరేణి ఆధ్వర్యంలో వెలికితీస్తున్నారు. దీంతో జిల్లాలో 4 పెద్ద తరహా మైనింగ్ క్వారీలు 2255.92 హెక్టార్లలో నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చిన్న తరహా ఖనిజాలను వెలికితీసేందుకు 247 మైనింగ్ కేంద్రాల్లో 729.388 హెక్టార్లలో మైనింగ్‌ను వెలికితీస్తున్నారు. ఈ చిన్నతరహా మైనింగ్‌లో ఎక్కువగా బ్లాక్ గ్రానైట్, స్టోన్ అండ్ మెటల్, డోలమైట్ ఖనిజాలు అధికంగా ఉండడం విశేషం. దీనిలో ప్రభుత్వ భూమిలో 764.506 హెక్టార్లలో గనులను వెలికితీస్తున్నారు. అలాగే 191.307 హెక్టార్లలో పట్టా భూముల్లో మైనింగ్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో గ్రానైట్-14, స్టోన్ ఎండ్ మెటల్-14, గ్రావెల్-3, కోరండమ్-01 క్వారీలు నడుస్తున్నాయి.
విస్తృత తనిఖీలు.. కేసుల నమోదు..
ఖమ్మం జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వారిపై మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారుల సమన్వయంగా విస్తృతమైన తనిఖీలను నిర్వహిస్తున్నారు. దీనికారణంగా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ క్రమంలో 2020-23 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,178 కేసులను నమోదు చేశారు. వాటిలో ఇసుక 670 కేసులు కాగా ఇతర ఖనిజాలకు సంబంధించినవి 508 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ద్వారా 2574.90 క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకుని అక్రమంగా తరలిస్తున్న వారినుంచి రూ.68.83 లక్షలు అపరాధ రుసుము ద్వారా వసూలు చేశారు. ఇతర ఖనిజాలు తరలిస్తున్న 1884.107 క్యూబిక్ మీటర్ల ఖనిజాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని అక్రమ తరలింపునకు పాల్పడిన వారి దగ్గర నుంచి రూ.40.61 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు.
జిల్లాలో గనుల అక్రమ నిర్వహణ తరలింపుపై అధికారులు దృష్టి సారించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగానే నిధులు సమకూరాయి. సీనరేజ్ రూపంలో జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుకను తవ్వేందుకు అనుమతులను ఇచ్చారు. ఆయా మండలాల్లో ఇప్పటివరకు 19,788 క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికితీసి దీనిద్వారా రూ.7.16 కోట్ల ఆదాయాన్ని సీనరేజ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే కల్లూరు, వైరా మండలాల్లో ఇసుక క్వారీలను వేలం వేసి ఇప్పటికే రూ.1.80 లక్షల ఆదాయాన్ని సమకూర్చారు. వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు, అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా ఉండి గనులశాఖ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు, పంచాయతీల నుంచి ఇద్దరు మహిళలు, పురుషులను సభ్యులుగా ఉంటారు. కమిటీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం జిల్లాలో సాండ్ ట్యాక్సీ, సాండ్ డిపో నిర్వహణ జరుగుతున్నది. నిర్వహణ ద్వారా ఇప్పటివరకు రూ.270.082 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది.
నూతన విధానంతో పెరిగిన ఆదాయం
నూతన మైనింగ్ విధానంతో జిల్లాలో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సీనరేజ్, రుసుముల రూపంలో వసూలు చేసిన ఆదాయం ప్రభుత్వ ఖాతాలో చేరింది. చిన్న, పెద్ద తరహా ఖనిజాల ద్వారా జిల్లాకు రూ.93.20 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలో మైనింగ్, రెవెన్యూ పోలీస్ అధికారుల ప్రత్యేక శ్రద్ధ కారణంగా మైనింగ్ ఆదాయం భారీగా పెరిగింది.
– సంజీవ్‌కుమార్, మైనింగ్ ఏడీ