భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో సకల ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి మొదలుకొని చిరుద్యోగులు వరకూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నెలల వేతనాలు అందకపోవడంతో ఆకలి కేకలతో రోడ్డెక్కుతున్నారు.
హైదరాబాద్ వచ్చి సమస్యలు చెప్పుకుందామంటే పోలీసుల ద్వారా నిర్బంధాలు చేయిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సమ్మెలు కొనసాగిస్తూనే కలెక్టరేట్ ధర్నాచౌక్ దద్దరిల్లేలా ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా కార్యకర్తలు, సర్వశిక్షా ఉద్యోగులు, మెప్మా ఆర్పీలు, మధ్యాహ్న భోజన వర్కర్లతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సైతం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్న చిరుద్యోగుల సమ్మెలకు కార్మిక సంఘాలు, పలు పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్డీ సహా ఇతర కుల సంఘాలు కూడా మద్దతు తెలిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయాలని, చిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని ఆశాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను కూడా ప్రారంభించారు. నారాయణపేట నుంచి ఈ యాత్రను సీఐటీయూ ప్రారంభించింది. ఈ నెల 26న భద్రాద్రి జిల్లాలో కళాజాతా నిర్వహించనుంది.
కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్ ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఒకవైపు వంటావార్పు, మరోవైపు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. వీరికి ఉద్యోగ సంఘాలు కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మెప్మా ఉద్యోగులు సైతం ధర్నా చేయడానికి నిర్ణయించారు. ప్రతి రోజూ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు నివేదికలు పంపుతున్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం చిరుద్యోగుల ధర్నాలపై స్పందించడం లేదు.
దీంతో ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని మరీ నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన వర్కర్లు ‘గుప్పెడు బియ్యం, పిడికెడు పప్పు’ కార్యక్రమం ద్వారా 48 గంటలపాటు దీక్షకు దిగారు. సర్కారు దిగి వచ్చేదాకా తమ ధర్నాలు ఆగవంటూ హెచ్చరిస్తున్నారు.
బడిలోని పిల్లలందరినీ మా పిల్లలుగా చూసుకుంటున్నాం. వారికి వండి పెట్టాలనే బాధ్యతతో, వారి ఆకలి తీర్చాలన్న ఆరాటంతో వేకువజామునే నిద్ర లేని ఇంట్లో పనులు ముగించుకొని త్వరత్వరగా స్కూలుకు చేరుకుంటున్నాం. ఖర్చులు భరించి పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాం. మరి మా సమస్యలను పట్టించుకోకపోతే ఎలా? ఇచ్చే మూడు వేల గౌరవ వేతనమూ సక్రమంగా ఇవ్వడం లేదు. మార్కెట్లో రేట్లు అమాంతం పెరిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం పాత ధరలనే ఇస్తోంది. ఇక బిల్లులైతే నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. పిల్లలకు వండి పెట్టేవాళ్లమే పస్తులుంటున్నాం.
-ఎస్కే సుల్తాన, మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు
ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. మా చేతిలో ఉన్న నగదు మొత్తం పిల్లల మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికే వెచ్చిస్తున్నాం. పాత బకాయిలు చెల్లించని కారణంగా దుకాణాల దగ్గర సరుకులు అరువుగా ఇస్తలేరు. ఇకవేళ దుకాణదారులు ఇచ్చినా ఎక్కువ రోజులైతే అడుగుతున్నారు. బిల్లులను ప్రభుత్వం త్వరగా ఇవ్వకుంటే మేమెక్కడి నుంచి తేవాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా బతుకులతో ఆడుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం మర్చిపోయింది.
-ఈశ్వరమ్మ, కొత్తగూడెం
సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ వెళితే అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ ధర్నా చేస్తే పట్టించుకోరు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఆశా కార్యకర్తల సమస్యలంటే అలుసుగా ఉన్నట్లుంది. అందుకే మా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పారాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 26న ఆశాల బస్‌యాత్ర ఉంది. సర్కారును కదిలిస్తాం. సమస్యల పరిష్కారం కోసం ఎంత వరకైనా వెళ్తాం.
-పద్మ, సీఐటీయూ నాయకురాలు, కొత్తగూడెం
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖలో 800 మందికి పైగా ఉద్యోగులు ధర్నా చేస్తుంటే కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో బోధన నిలిచిపోయింది. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేజీబీవీల్లో పిల్లలకు చదువు లేకున్నా ఏంకాదని ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఆ పిల్లలకు క్లాసులు జరగకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం దిగిరాకపోతే అంతుచూస్తాం.
-నాగ శ్రావణి, కంప్యూటర్ ఆపరేటర్, జూలూరుపాడు