భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ) : గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీసుకొచ్చి 500 పడకల మాతా, శిశు ఆసుపత్రితోపాటు సకల సౌకర్యాలతో సర్వజన ఆసుపత్రిని తీర్చిదిద్దారు. కానీ, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సర్కారు కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం వైద్యులను నియమించుకోలేక చేతులెత్తేసింది. ఒక్కసారే 32 మంది వైద్యులు పై చదువుల కోసం వెళ్లగా.. సర్దుబాటు చేయలేక నానా తంటాలు పడుతున్నది.
పేదలకు వైద్యసేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 12 ఆసుపత్రుల్లో 24 గంటల వైద్యసేవలు అందించాల్సి ఉండగా.. ఒక్క ఆసుపత్రిలో సైతం రాత్రిళ్లు సేవలు అందడం లేదు. దీంతో వైద్యసేవలు అత్యవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయక తప్పడం లేదని నిరుపేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు కరోనా సమయంలో కూడా వైద్యుల పోస్టులు ఎక్కడా ఖాళీ లేకుండా ఫుల్‌గా ఉన్న ఆసుపత్రులు ఇప్పుడు నిల్ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 4 అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లు ఉన్నాయి. మొత్తంగా 68 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 34 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 24 గంటల ఆసుపత్రులు రాత్రి సేవలకు మంగళం పలికాయి. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కూడా వైద్యులు లేకపోవడంతో ఆర్బీఎస్కేలో పనిచేస్తున్న తాత్కాలిక వైద్యులను తీసుకొచ్చి కొన్నిచోట్ల డిప్యుటేషన్ వేయడంతో వారు రెండుచోట్ల చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఒక్కసారే 32 మంది డాక్టర్లు పీజీ చదువులకు వెళ్తే ఆ శాఖ ఏం చేస్తుందో అంతుబట్టని విషయం. కనీసం ఆ శాఖ మంత్రి కూడా దీనిపై రివ్యూ చేయకపోవడం గమనార్హం.

వైద్యుల పోస్టులు ఇలా ఉంటే.. వైద్యులను మానిటరింగ్ చేసే ప్రోగ్రాం అధికారులు కూడా లేకపోవడం చాలా దారుణం. ప్రతి శాఖకు జిల్లాలో ఒక అధికారి ఉంటారు. వారినే ప్రోగ్రాం అధికారి అంటారు. మాతా, శిశు, టీబీ, ఎన్సీడీ, మలేరియా, లెప్రసీ, ఆర్బీఎస్కేతోపాటు మరికొన్ని ముఖ్యమైన విభాగాలతోపాటు డిప్యూటీ డీఎంహెచ్వోలు కూడా ఉంటారు. ఇందులో ఇద్దరు తప్ప మిగతా అధికారులు లేకపోవడంతో ఆసుపత్రుల్లో సేవలు అందుతున్నాయో లేదో చూసేవారు కరువయ్యారు. దీంతో జిల్లా వైద్యాధికారి తనిఖీలు చేసినా అది కంటితుడుపు చర్యలానే మిగిలిపోతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మా సర్కారులో గొప్పగా వైద్యసేవలు అందుతున్నాయని గప్పాలు చెప్పుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన దిశ కమిటీ సమావేశంలో వైద్యసేవల గురించి మొరపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇల్లెందు, అశ్వారావుపేట ఆసుపత్రులకు అంబులెన్స్‌లు లేవని, తక్షణమే ఏర్పాటు చేయాలని సమావేశంలో విన్నవించుకున్నారు. కనీసం తాత్కాలిక వైద్యులనైనా నియమించాలని వేడుకున్నారు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేక.. ఎవరికీ చెప్పుకోలేక చివరికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మాది చాలా పెద్ద మండలం. అయినా ఇక్కడ వైద్యులు లేరు. రాత్రయితే బయటకు వెళ్లాల్సిందే. పగలు కూడా ఇదే పరిస్థితి. డాక్టర్లు వారానికి మూడు రోజులు ఇక్కడ.. మూడు రోజులు రామవరం ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ఇట్లా అయితే ఆసుపత్రికి ఎవరు వస్తారు. 24 గంటల ఆసుపత్రి ఎందుకు పెట్టారు. సేవలు లేనప్పుడు మాకెందుకు ఆసుపత్రి. రోగులకు కనీసం తాగునీరు కూడా లేదు.
– మద్దిరాల చిన్నపిచ్చయ్య, రావికంపాడు, చండ్రుగొండ మండలం
24 గంటలు పని చేయాల్సిన ఆసుపత్రులకు తప్ప మిగతా అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని సర్దుబాటు చేశాం. ఆర్బీఎస్కేలో పనిచేసే వారిని నియమించాం. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ప్రభుత్వానికి తెలియజేశాం. త్వరలో అన్ని పోస్టులను భర్తీ చేస్తారు. వైద్యసేవలు అత్యవసరమైతే జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాం. గర్భిణులకు ఎక్కడా ఇబ్బంది లేదు. రామవరంలో మాతా, శిశు కేంద్రం ఉంది. అక్కడ గైనిక్ డాక్టర్లు సరిపడా ఉన్నారు. సేవలు మంచిగా అందుతున్నాయి.
– డాక్టర్ తుకారాం రాథోడ్, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం