దుమ్ముగూడెం, ఆగస్టు 11 : దుమ్ముగూడెం మండలంలోని బైరాగులపాడు గ్రామంలో భార్యపై భర్త వేట కొడవలితో దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య, భర్తకు ఎంతో కాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తురం మహేశ్వరి బైరాగులపాడు గ్రామంలో డ్వాక్రాకు సంబంధించిన పనిపై ఊరు వెళ్లింది. భర్త శివాజీ మద్యం మత్తులో నడిరోడ్డుపై వేట కొడవలితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని స్థానికులు 108వాహనం ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ విషయంపై దుమ్ముగూడెం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.