బయ్యారం సెప్టెంబర్ 22 : పంటలు సాగు నీళ్లు ఇవ్వాలని ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి(ఎన్ హెచ్ 930పీ) బయ్యారం బస్టాండ్ సెంటర్ వద్ద రైతులు ధర్నా చేశారు. బయ్యారం పెద్ద చెరువు ఆయకట్టు రైతులు ఈ ఏడాది వానాకాలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో పంటలు వేశారు. అయితే వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో బయ్యారం పెద్ద చెరువు గరిష్ఠ నీటిమట్టం 16.2 అడుగులు చేరి ఇటీవల మత్తడి పడింది. దీంతో రైతులు గత కొన్ని రోజులుగా పంటల సాగుకు నీరు అందించాలని అధికారులను కోరుతున్నారు.
అధికారులు నీటి విడుదల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో శుక్రవారం సమావేశమైన రైతులు ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బయ్యారం బస్టాండ్ సెంటర్లోని రహదారిపై గంట సేపు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి తాసిల్దార్ నాగరాజు, ఇరిగేషన్ డీఈ సాగర్, సీఐ రవీందర్ చేరుకొని రైతులతో మాట్లాడారు. తమ పంటలు ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు. వేల ఎకరాల పెట్టుబడి పెట్టి పంటలు సాగు ప్రారంభించామని నీళ్లు ఇవ్వకపోతే పంటలు ఎండి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.