భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్లను తొలగింపజేశారు. పొలిటికల్ వాల్ రైటింగ్స్‌పై పెయింట్ వేయించారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్ గంగన్న జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించకూడదని సూచించారు.
ఎస్పీ వినీత్ గంగన్న ఆదేశాల మేరకు పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఎలాంటి పత్రాలు, బిల్లులు, రశీదులు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. రెండు రోజుల్లో ఒక్క కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలోనే పోలీసులు రూ.లక్ష వరకు నగదు సీజ్ చేశారు. భద్రాచలం, కొత్తగూడెం, బూర్గంపహాడ్, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఇప్పటికే పలుచోట్ల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభమయ్యాయి. కోడ్ ఫలితంగా గృహలక్ష్మి మంజూరు పత్రాల పంపిణీ, బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 233 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల రిటర్నింగ్ అధికారులను నియమించారు. భద్రాచలం నియోజకవర్గానికి ఆర్డీవో మంగీలాల్, అశ్వారావుపేటకు అదనపు కలెక్టర్ రాంబాబు, ఇల్లెందుకు ఎస్డీసీ కాశయ్య, పినపాకకు ఐటీడీఏ పవో ప్రతీక్ జైన్, కొత్తగూడేనికి ఆర్డీవో శిరీష నియమితులయ్యారు. అలాగే 170 మంది సెక్టోరియల్ అధికారులు, పలువురు నోడల్ అధికారులనూ కలెక్టర్ నియమించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చట్ట వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నా, యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా, ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించడానికి కలెక్టర్ ప్రియాంక ఆల జిల్లాకేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజలు 1950 అనేనంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.