మామిళ్లగూడెం, జూలై 30: తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మంలో మంగళవారం భారీ రాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేపట్టారు.
ఈ సందర్భంగా ఫోరం బాధ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను ఆదుకుంటామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఇంకా ఆ హామీల ఊసు ఎత్తడంలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఖాళీ స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల సాయం అందించాలని, నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంకా ఇతర హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఫోరం బాధ్యులు డాక్టర్ కేవీ కృష్ణారావు, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, బత్తిన మధుగౌడ్, రవిచంద్ర, పగడాల నరేందర్ పాల్గొన్నారు.