పాల్వంచ, ఏప్రిల్ 5: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని సుగుణ గార్డెన్స్‌లో శనివారం జిల్లాస్థాయి ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో కానీ, ఇతర సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం చేపట్టి పదినెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సీఎం పదే పదే చెబుతూ వస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు దశల వారీగా ఆందోళనలు చేపడతామని, మే 4వ తేదీన రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తామని, మే 15వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఆ తర్వాత జూన్ 10వ తేదీన హైదరాబాద్‌లో మహాధర్నా కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, బి.రాజు, అమరనేని రామారావు, కంచర్ల సాయి భార్గవ్ చైతన్య, పీఆర్టీయూ నుంచి రవి, రాజశేఖర్, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.