చర్ల, జనవరి 23 : నియోజకవర్గంలోని ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన ఆయన వైద్యుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సాయివర్ధన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సిమాంక్ సెంటర్‌గా ఉన్న ఆస్పత్రిని గత కేసీఆర్ ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసిందన్నారు.
ఈ క్రమంలో సీహెచ్‌సీకి అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరానని అన్నారు. త్వరలోనే సీహెచ్‌సీని అన్ని వసతులతో ప్రారంభించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చర్ల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.