సత్తుపల్లి టౌన్/ ఎర్రుపాలెం/ టేకులపల్లి/ ఇల్లెందు రూరల్/ కరకగూడెం/ అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్/ అశ్వారావుపేట రూరల్/ అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలవాలింది.
సత్తుపల్లి మండలం సత్తుపల్లి, బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి, సిద్ధారం, సదాశివునిపేట, తుంబూరు తదితర గ్రామాల్లో పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు సోమవారం సాయంత్రం గాలిదుమారంతో రాలిపోయాయి. మామిడి తోటలను లీజుకు తీసుకున్న కౌలు వ్యాపారులు గాలిదుమారం మా నోట్లో మట్టి కొట్టిందని వాపోతున్నారు. ఎర్రపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి కాయలు నేలరాలాయి.
ఉద్యానవన అధికారి విష్ణు, ఏవో సాయిశివ, ఏఈవో వంశీకృష్ణ.. రాజుపాలెం, బుచ్చిరెడ్డిపాలెం, భీమవరం, మామునూరు, వెంకటాపురం, నారాయణపురం గ్రామాల్లో మంగళవారం పర్యటించి నష్టపోయిన పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపిస్తామని తెలిపారు. టేకులపల్లి మండలం గంగారం, బోడు, కోయగూడెం, చింతోనిచెలక, మేళ్లమడుగు, సంపత్‌నగర్, వజ్జోనిగూడెం తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి.
పలు గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఇల్లెందు మండలం పోచారం, మర్రిగూడెం, పోలారం, కొమరారం, బోయతండా, మాణిక్యారం, ముత్తారపుకట్ట, మసివాగు తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు నాయిని రాజు, నాయకులు శ్రీరామ్, కోటయ్య, గాంధీ, రాఘవులు పరిశీలించారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంట ఎకరాకు రూ.25 వేలు, వరి పంట ఎకరాకు రూ.35 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కరకగూడెం మండలంలో సోమవారం రాత్రి గాలిదుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కరకగూడెం-పినపాక ప్రధాన రహదారిపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరి, మిర్చి పంటలకు కొంతమేర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అశ్వారావుపేట మండలంలో మంగళవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఊట్లపల్లి వద్ద ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది.
పొగాకు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అరటి పంటలకు సైతం వర్షం తాకిడి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తమామిళ్లవారిగూడెం గ్రామానికి చెందిన నల్లాని వెంకటేశ్వరరావుకు చెందిన 4 ఎకరాల మునగ తోట నేలమట్టమైంది. పూత, పిందె, కాయ దశలో ఉన్న పంటలు గాలిదుమారంతో నేలపాలయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మల్లాయిగూడెం, పండువారిగూడెం, దబ్బతోగు, అనంతారం, తిరుమలకుంట, వినాయకపురం, ఆసుపాక, నారాయణపురంతోపాటు పలు గ్రామాల్లో వర్షం కురవడంతో పొగాకు, గుమ్మడి, మొక్కజొన్న, నాటు పొగాకు, మామిడి, జీడిమామిడి, పుచ్చ రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు తగ్గే అవకాశం ఉందని దిగులు చెందుతున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. కోసిన ధాన్యం, మిర్చి వర్షానికి తడిసిపోయాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
రుద్రాక్షపల్లి గ్రామంలో 30 ఎకరాల మామిడి తోటను లీజుకు తీసుకున్నా. సోమవారం సాయంత్రం గాలిదుమారంతో చేతికొచ్చిన పంట అంతా నేలపాలైంది. మార్కెట్లో మామిడి టన్ను ధర రూ.30 నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది. గాలిదుమారం, అకాల వర్షంతో లక్షల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు.
-ధరావత్ కృష్ణ, రైతు, రుద్రాక్షపల్లి, సత్తుపల్లి మండలం