కారేపల్లి, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులకు విద్య అందుతున్నది. అనుభవం, అర్హత కలిగిన బోధనా సిబ్బంది నాణ్యమైన విద్య అందిస్తున్నారు. విద్యార్థులకు విద్య అందించడంతో పాటు సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. బట్టి చదువులకు స్వస్తి పలికి ప్రయోగాత్మక, గుణాత్మక విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డిజిటల్ తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తూ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. సర్కార్ విద్యార్థులు కార్పొరేట్ సంస్థలకు దీటుగా చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘మన ఊరు- మన బడి’తో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు బోధన అందనున్నది. ఈ నేపథ్యంలో కారేపల్లి (సింగరేణి) మండలంలో జరిగిన విద్యావికాసంపై ప్రత్యేక కథనం.
కారేపల్లి మండలం ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. కారేపల్లిలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా బాలికల విద్యాలయం, మేకల తండా సమీకృత గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఉసిరికాయలపల్లి, రేలకాయలపల్లిలోని ఐటీడీఏ గిరిజన బాలుర వసతి గృహాలు విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇవేకాక మండల వ్యాప్తంగా 59 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 14 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నది. ఉమ్మడి పాలనలో అరకొర వసతులతో కునారిల్లిన పాఠశాలలు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రూపురేఖలు మార్చుకున్నాయి. సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు అందజేస్తున్నది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నది. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించింది. దీంతో విద్యార్థులు ఇష్టంగా బడులకు వస్తున్నారు. డ్రాపౌట్స్ ఏటికేడు గణనీయంగా తగ్గుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేస్తున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి మండలవ్యాప్తంగా 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. దీంతో పేరుపల్లి ప్రాథమిక పాఠశాల, సూర్యతండా పాఠశాల, పేరుపల్లి జడ్పీహెచ్ఎస్, పంతులునాయక్తండా ప్రాథమిక పాఠశాల, పెద్దతండా ప్రాథమికోన్నత పాఠశాల, పెద్దమడెంపల్లి ప్రాథమిక పాఠశాల, మోకాళ్లగుంపు ప్రాథమిక పాఠశాల, కారేపల్లి ప్రాథమిక పాఠశాల, బీక్యాతండా ప్రాథమిక పాఠశాల, కారేపల్లి ప్రాథమిక పాఠశాల, రొట్టమాకురేవు ప్రాథమిక పాఠశాల, గేట్ కారేపల్లి ప్రాథమిక పాఠశాల, గేట్ కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాల, గిద్దెవారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల, కొమ్ముగూడెం ప్రాథమిక పాఠశాల, గాదెపాడు ప్రాథమికోన్నత పాఠశాల, మాణిక్యారం ప్రాథమిక పాఠశాల, మాణిక్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాజుమల్లాయిగూడెం ప్రాథమిక పాఠశాల, పాటిమీదగుంపు ప్రాథమికోన్నత పాఠశాల, చీమలపాడు ప్రాథమిక పాఠశాల, చింతల తండా ప్రాథమిక పాఠశాలకు మహర్దశ పట్టనున్నది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే వారూ సర్కార్ బడి బాట పడుతున్నారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించడానికి పెద్ద ఎత్తున పైరవీలు జరగడమే అందుకు నిదర్శనం.
– జయరాజు, మండల విద్యాశాఖ అధికారి, కారేపల్లి