కారేపల్లి, అక్టోబర్ 01 : కారు, మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పేరుపల్లి గ్రామానికి చెందిన సిరికొండ కృష్ణ తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి నుండి స్వగ్రామానికి వస్తున్నాడు. పేరుపల్లి నుండి కారేపల్లి వైపు వస్తున్న కారు, కృష్ణ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ రామోజీతండా మూల మలుపు వద్ద బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కృష్ణ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కారేపల్లి పోలీసులు వాహనాలను స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.