కూసుమంచి(నేలకొండపల్లి), జూన్ 2 : నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఉన్నాయి. తండాకు చెందిన ధరావత్ కేశ్యా కూలి పనులు చేసుకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. రేకుల షెడ్లో నివసిస్తున్న అతడు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని జాబితాలో పేరు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.
ఈ క్రమంలో అధికారులు సోమవారం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కేశ్యా.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పక్కనే ఉన్న వారు, అధికారులు కలుగజేసుకొని అతడికి నచ్చజెప్పారు. నిరుపేదనైన తనకు అన్ని అర్హతలున్నా ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించాడు. ఆస్తులు, బంగ్లాలు ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేస్తారా? మా లాంటి నిరుపేదలు మీకు కనిపించరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకున్న రేకుల షెడ్డును చూసి అధికారులు ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు.