మధిర, సెప్టెంబర్ 13 : ఓటమి భయంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రలోభాలకు దిగాడని, మధిర బీఆర్ఎస్ కంచుకోట అని, దాన్ని కదిలించడం భట్టికి సాధ్యం కాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. శనివారం చింతకాని మండలంలోని పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు చేశారు. భట్టి అధికార మదంతో, ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల రూపంలో వచ్చే డబ్బుతో ప్రలోభాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ను కదిలించడం భట్టి విక్రమార్క తరం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా కొంతమంది పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరాలని భయపెడుతున్నట్లు తెలిపారు.
దీనికి సంబందించిన ఆధారాలు తన దగ్గర ఉన్నట్లు చెప్పారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు. ఇది భట్టి చేయిస్తున్న చిల్లర రాజకీయం అని దుయ్యబట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు చేసిన తప్పులకు మిత్తితో సహా చెల్లిస్తాం అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో చింతకాని మండల నాయకులు మంకెన రమేశ్, బొడ్డు వెంకట రామారావు, గురజాల హనుమంతరావు, వంకాయలపాటి సత్యనారాయణ, పిన్నెల్లి శ్రీనివాసరావు, కన్నెబోయిన కుటుంబరావు, పోనుగోటి రత్నాకర్, వేముల నరసయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Madhira : ఓటమి భయంతో ప్రలోభాలకు దిగిన మల్లు భట్టి విక్రమార్క : లింగాల కమల్ రాజ్