ఖమ్మం, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భట్టి విక్రమార్క ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. రాష్ర్టాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు 55 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిన మహిళలకు రూ.167.89 కోట్లు ఆదా అయ్యాయన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 2,42,146 కుటుంబాలు పొందుతున్నాయని, దీని ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.26.30 కోట్ల సొమ్మును జమ చేశామన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగిస్తున్న వారికి జిల్లాలో రూ.130.18 కోట్ల సబ్సిడీ చెల్లించి 2,43,647 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 9,326 మందికి ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మహిళా మార్ట్, క్యాంటిన్లు, 64 స్త్రీ క్యాంటిన్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.379.34 లక్షలతో 613 క్యాటిల్ షెడ్లు, రూ.57.13 లక్షలతో 28 ఫౌల్ట్రీ షెడ్లు పూర్తి చేశామన్నారు. అనంతరం రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. దేశభక్తి గేయాలపై చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన స్టాళ్లు, శకటాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీబీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మేయర్ నీరజ, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జడ్పీ సీఈవో దీక్షారైనా, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.