ఇల్లెందు, ఆగస్టు 10 : మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తున్నది. మక్కల కొనుగోలు సమయంలో కాంటాలు, రవాణా విషయంలో చుక్కలు చూపెట్టిన ప్రభుత్వం తాజాగా వారి ఖాతాల్లో వేసిన డబ్బుల్లోనూ భారీగా కోతలు విధించి మద్దతు ధర ఉత్తదేనంటూ చేతులెత్తేసింది. భద్రాద్రి జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేసిన విషయం విదితమే. పండిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు వస్తుందన్న ఆశతో రైతులు అమ్ముకున్నారు. కానీ, వారి ఆశలు అడియాశలయ్యాయి. వెంటనే చెల్లిస్తామన్న మక్కల డబ్బులను వానకాలం చెరిసగం వచ్చినంక ఖాతాల్లో వేసింది ప్రభుత్వం. అయితే ఆ డబ్బుల్లో కూడా తరుగు పేరుతో భారీ కోతలు విధించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇల్లెందు మండల పరిధిలో పరిశీలిస్తే.. 26 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు.
పండిన పంటను ప్రభుత్వం ఇల్లెందు మార్కెట్‌యార్డు, కొమరారం, చల్లసముద్రం సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 2 లక్షల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద సమయానికి కాంటాలు వేయకపోవడం, లారీలతో రవాణా చేయకపోవడం వంటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చాలా రోజులు అక్కడే మొక్కజొన్నల వద్ద రైతులు పడిగాపులు కాశారు. ఆ సమయంలో పడిన అకాల వర్షాలకు మొక్కజొన్నలు తడిశాయి. రైతులెవ్వరూ అధైర్యపడొద్దు.. తడిసిన మక్కలను సైతం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా రైతులకు డబ్బులు చెల్లించేకాడికి వచ్చేసరికి భారీగా కోతలు పెట్టింది. ఈ విషయంపై రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వానకాలం సగం అవుతున్నా పూర్తిస్థాయిలో మక్కల డబ్బులు పడకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇల్లెందు మండల పరిధిలో మొత్తం మూడు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నాలుగు లక్షల బస్తాలు అంటే.. సుమారు రెండు లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసింది. మొత్తం మూడు కొనుగోలు కేంద్రాల్లో కలిపి 3,710 బస్తాలు.. 1,855 క్వింటాళ్లు పూర్తిగా తడిసినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. అలాగే రైతులకు డబ్బు చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వ వైఖరి కఠినంగా ఉంది. తడిసిన మక్కలను సైతం మద్దతు ధరకు కొంటామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మొత్తం డబ్బులు వేయలేదు. తడిసిన, తేమ శాతం సాకుతో భారీగా కోతలు విధించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నా పేరు గొగ్గెల పాపారావు. మాది ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామం. యాసంగి మొక్కజొన్న పంటను ఇల్లెందు మార్కెట్ యార్డులో అమ్మాను. నా భార్య పేరుతో 286 బస్తాలు, నా పేరుతో 184 బస్తాల మొక్కజొన్న వేశాం. వాటిలో మాకు రావాల్సిన డబ్బుల్లో నా భార్య బ్యాంక్ ఖాతాలో రూ.15,600, నా బ్యాంక్ ఖాతాలో రూ.14,400 మొత్తం రూ.30 వేలు తక్కువ డబ్బులు వేశారు. దీనిపై కలెక్టర్, స్థానిక అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చాము. పూర్తి డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేయాలి.
నా పేరు సూవర్ణపాక రాంబాబు. మాది ఇల్లెందు మండలం మామిడిగుండాల పంచాయతీలోని బోటిగుంపు గ్రామం. దళారులకు అమ్మి మోసపోవద్దని యాసంగి మొక్కజొన్న పంటను సొసైటీ కొనుగోలు కేంద్రంలో అమ్మాను. మా పెద్దనాన్న చిన్న పుల్లయ్య పేరు మీద 264 బస్తాలు వేశాను. తీరా డబ్బులు చూస్తే రూ.13,200 తక్కువగా ఖాతాలో పడ్డాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వమే ఇలా కోత విధించి డబ్బులు తగ్గించి వేయడం చాలా బాధగా ఉంది.
ఇల్లెందు, కొమరారం, చల్లసముద్రం వద్ద ఏర్పాటు చేసిన యాసంగి కొనుగోలు కేంద్రాల్లో 290 మంది రైతులకు సంబంధించిన 3,710 మొక్కజొన్న బస్తాలు తడిశాయి. దీంతో ఆయా రైతుల ఖాతాల్లో పడే డబ్బుల్లో కోతలు విధిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు నష్టం కలుగకుండా పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– మెట్ల కృష్ణ, ఇల్లెందు సొసైటీ చైర్మన్