మధిర, జనవరి 25 : గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మధిర మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రూ.150 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మధిరలోని రిక్రియేషన్ క్లబ్లో మున్సిపల్ పాలక మండలి వీడ్కోలు సన్మాన కార్యక్రమం కమిషనర్ సంపత్‌కుమార్ అధ్యక్షతన శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ఆస్పత్రి, కోర్టు భవనం, , ట్యాంక్ బండ్ నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కోసమే ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు. మధిర మున్సిపాలిటీ పాలకవర్గం చేసిన అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో మధిర కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. రాజకీయాలకు అతీతంగా మధిర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇక్కడి నాయకత్వానికే గుర్తింపు ఉందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుంచారన్నారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్తోపాటు వార్డు కౌన్సిలర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.
వీరితోపాటు మాజీ ప్రజాప్రతినిధులు, అతిథులను సన్మానించి అభినందించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఏపీ రాష్ట్రం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగుండ్ల స్వామిదాస్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్నాథం, పుంతబాక కృష్ణప్రసాద్, వాసిరెడ్డి రామనాథం, బిక్క కృష్ణప్రసాద్, వల్లబోతుల వెంకటేశ్వర్లు, సూరంశెట్టి కిశోర్, శీలం కవిత, కట్టా గాంధీ, మల్లాది వాసు, అన్నంశెట్టి అప్పారావు, అరిగా రజిని, షేక్ ఇక్బాల్, రావూరి శ్రీనివాసరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.