బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి జోరు కొనసాగుతున్నది. పురుషుల సింగిల్స్‌లో ఈ యువ షట్లర్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తరుణ్.. 21-14, 22-20తో జస్టిన్ హో (మలేషియా)ను మట్టికరిపించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా గెలుచుకున్న తరుణ్.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా పట్టు కోల్పోకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించినా వారికి దురదృష్టం గాయం రూపంలో వెంటాడింది. సాత్విక్ భుజం నొప్పి కారణంగా ఈ జోడీ టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. అంతకుముందు సుమారు గంటపావు పాటు హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో భారత ద్వయం.. 21-15, 15-21, 28-26తో ఒకమురా, యమషిట (జపాన్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా-ధ్రువ్ జంట ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.