ఇంకెంత కాలం ఈ సాగదీతలు!
తమ సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది.
- మీరు ఉద్యమించేదెప్పుడు..!మా జీవితాలు మారేదెప్పుడు?
- ఆర్టీసీని చూసైనా నేర్చుకోండి ఉద్యోగ నేతలపై ఉద్యోగుల ఫైర్
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తమ సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. తీవ్ర అసంతృప్తి, అశాంతికి దారితీస్తున్నది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ఉద్యోగ సంఘాల నాయకులను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొందరు నాయకులు సర్కార్‌కు అమ్ముడుపోయారన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘అయ్యా.. నేతల్లారా.. మీరు ఉద్యమించేదెప్పుడు..? ఉద్యోగుల జీవితాలు మారేదెప్పుడు..?’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ వేదికగా ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ‘పీఆర్సీ ఊసేలేదు… డీఏలు విడుదలకావు… హెల్త్‌కార్డు చేతికి రాదు… రిటైర్మెంట్ బెనిఫిట్లు, బకాయిలు అందవు… సీపీఎస్ స్కీమ్ రద్దు హామీ నెరవేరనే లేదు… ఇంకెంతకాలం ఈ సాగదీతలు?’ అంటూ ఉద్యోగులు తమ సంఘాల నేతల మీద ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను చూసైనా కాస్త నేర్చుకోండని చురకలేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారని, మరి ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు.
కొంచెం.. కనికరమనిపిస్తలేదా?
కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సర్కార్‌కు విశ్వాసపాత్రులుగా ఉంటూ తమను మోసం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కీలక సమస్యలు వచ్చినప్పుడు మౌనం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ తీరు చూస్తే ‘మూడు కార్యాచరణలు.. ఆరు వాయిదా’లను తలపిస్తున్నదని ఓ నేత బహిరంగంగానే విస్మయం వ్యక్తంచేశారు. ‘ఒకట్రెండు రోజుల్లో హెల్త్‌కార్డు అన్నారు. డిజిటల్కార్డు ఇస్తామన్నారు. డిజిటలో.. నాన్ డిజిటలో.. ముందు ఏదో ఒకటి ఇవ్వండి’ అంటూ ఓ టీచర్ వ్యాఖ్యానించారు. ‘గొంతు క్యాన్సర్‌తో పెద్దపల్లి జిల్లాలో టీచర్ కానుగంటి అంజయ్య పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇలాంటి ఘటనలు అనేకం. తలచుకుంటేనే దుఃఖం వస్తున్నది. అయినా మా సంఘ నాయకులకు కనికరమనిపిస్తలేదు. సర్కార్‌కు పట్టింపేలేదు. ఎన్నికలొస్తేనే హెల్త్‌కార్డులు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లేవు కదా.. అందుకే పట్టించుకోవడంలేదమో’నని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీచర్ ఆవేదన వ్యక్తంచేశారు.
శ్వేతపత్రం విడుదల చేయండి
ఉద్యోగులకు సర్కార్ విడుదల చేస్తున్న రూ.700 కోట్ల బిల్లులపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు చెల్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెల నెలా ఎవరికి ఎంత మొత్తంలో చెల్లించారో వివరాలు బహిర్గతం చేయాలని కోరుతున్నాయి. ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, చాలామంది తమ బిల్లులు క్లియర్కాలేదని చెప్తున్నారని, కాబట్టి, పూర్తి వివరాలు ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వడంలేదని, ప్రతినెలా రూ.200 కోట్లు పైరవీకారులకే వెళ్తున్నదని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగుల పేరిట కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లిస్తున్నారేమోనని మరికొందరు టీచర్లు అనుమానిస్తున్నారు.
మాడల్ టీచర్లకు డీఏ బకాయిలేవీ?
రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లకు కరువు భత్యం (డీఏ) బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏకంగా ఐదు డీఏల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. మాడల్ స్కూల్ టీచర్లకు 2021 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు బకాయిలు విడుదల కావాల్సి ఉన్నది. ప్రిన్సిపాళ్లకు రూ.3.9 లక్షలు, పీటీజీలకు రూ.3.1 లక్షలు, టీజీటీలకు రూ.2.6 లక్షల చొప్పున బకాయిలున్నాయి. దీంతోపాటు సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా జమ కావడంలేదు. 2013 నుంచి 2018 వరకు ఈ గ్రాంట్ జమ చేయాల్సి ఉన్నది. ఈ సమస్యలపై మాడల్ స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలుమార్లు ప్రస్తావించినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీంతో మాడల్ స్కూల్ టీచర్లు గుర్రుగా ఉన్నారు.
243 రోజులు టెంట్లోనే..
ఇండ్ల స్థలాల కోసం నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎడతెగని పోరాటం చేస్తున్నారు. భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి చెందిన 1,600 మంది ఉద్యోగులు 243 రోజులుగా టెంట్లోనే గడుపుతున్నారు. ఈ సమస్యకు ఏ ఒక్కరూ పరిష్కారం చూపించలేదు. దీంతో ఆయా సొసైటీల్లోని ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సొసైటీకి చెందిన 17 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ సర్కార్ ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది. ఉద్యోగుల సొసైటీకి చెందిన స్థలాన్ని ఉద్యోగుల నుంచి లాక్కుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినా పెద్ద నాయకులు పోరాడటం లేదని ఆయా సొసైటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యాఖ్యలు
- చేవ చచ్చినా, నిస్సత్తువ ఆవహించినా, మరణశయ్యపై నిద్రిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులకు జోహార్లు
- రెండోసారేం కర్మ ఎన్నోసారైనా సీఎం పోస్టు తీసుకోండి.. మాకు పీఆర్సీ, డీఏలు ఇవ్వండి
- పోయాం.. నమ్మి మోసపోయాం. ఇప్పుడు కాదు 2023 నవంబర్లోనే మోసపోయాం.
- ధర్నాల్లేవు..రాస్తారోకోల్లేవు.. ముట్టడిల మాటే మరచినం. వాట్సాప్.. టెలిగ్రామ్ పులులుగా మారినం. ఎన్నాళ్లీ ఉడుత ఊపులు.. ఉత్తుత్తి గాండ్రింపులు
- ఆయ్యా.. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. తూర్పు వైపు తిరిగి ఆశీర్వాదాలు పొందండి.
- ఉద్యమమన్నారు.. సమరమన్నారు.. కేసులు మాఫీ చేసుకున్నరు. ప్రమోషన్లు పొందిండ్రు. ఇక ఖేల్ కతం దుకాణం బంద్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

