ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థి, యువజన నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని విమర్శించారు. తాను మాట్లాడిన మాటలను తానే ఖండిస్తున్నాడని అన్నారు. తెలంగాణలోని 10 లక్షల మంది ఇంజినీర్లు క్రిమినల్ వేస్టా అని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశానికి మణిహారమైన సింగరేణిలోని ఇంజినీర్లు క్రిమినల్ వేస్టా.. ప్రపంచంలోని మేటి సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు క్రిమినల్ వేస్టా? అని నిలదీశారు. ఇంజినీర్లపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపైనే అత్యధికంగా 89 కేసులు ఉన్నాయని రాకేశ్ రెడ్డి తెలిపారు. అందులో 76 కేసులు తీవ్రమైనవే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద క్రిమినల్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డే అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తలేవని అన్నారు. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని చెప్పారు. ఐటీ, తయారీ రంగం కూడా పడిపోతే రాష్ట్రం దివాళా తీస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఇంజినీర్లకు భేషరతుగా ఇంజినీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టడానికే రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు.