Goldy Brar : ఢిల్లీకి చెందిన ఒక మహిళకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. రూ.200 కోట్లు ఇవ్వకుంటే ఆ మహిళను, ఆమె భర్తను చంపేస్తామంటూ వాట్సాప్‌లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. అది కూడా ప్రముఖ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరిట. దీంతో బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాలివి. ఢిల్లీకి చెందిన 50 ఏళ్ల ఒక మహిళకు స్తానిక సివిల్ లైన్స్ ఏరియాలో వారసత్వపు ఆస్తులు ఉన్నాయి.
ఆమెకు సెప్టెంబర్ 7న రాత్రి 10.44 గంటలకు విదేశీ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన వ్యక్తి తనను తాను గోల్డీ బ్రార్ అని పరిచయం చేసుకున్నాడు. అలాగే, బాధిత మహిళకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పాడు. అనంతరం ఆమెను రూ.200 కోట్లు ఇవ్వాల్సిందిగా ఆమెను బెదిరించాడు. తను అడిగినట్లు రూ.200 కోట్లు ఇవ్వకుంటే ఆ మహిళను, ఆమె భర్తను చంపేస్తామని హెచ్చరించాడు. అయితే, మొదటిసారి వచ్చిన ఆ బెదిరింపు కాల్‌ను ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత మరో బెదిరింపు కాల్ కూడా వచ్చింది.
దీంతో భయపడిన బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్ చేసింది నిజంగా గోల్డీ బ్రారా.. లేక ఇంకెవరైనా బెదిరిస్తూ అతడి పేరు వాడుకుంటున్నారా అనే అంశంపై విచారణ జరుపుతున్నారు.ఈ కాల్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటనేది కూడా ఆరా తీస్తున్నారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు అన్నారు.
ఇండియాకు చెందిన సతిందర్‌జిత్ సింగ్.. గోల్డీ బ్రార్‌గా మాఫియాను నిర్వహిస్తున్నాడు. కెనడాలో లేదా అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాసహా పలు హత్యలు, దోపిడీ కేసుల్లో అతడు కీలక నిందితుడిగా ఉన్నారు. గోల్డీ బ్రార్‌పై ఇండియాలో ఉపా చట్టం కింద కూడా కేసు నమోదైంది.