ఎల్బీనగర్, మార్చి 13: ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ యువత వెనక్కి తగ్గడమే లేదు. మిలియన్ మార్చ్‌లో భాగంగా రెండోరోజైన శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చిన నిరుద్యోగులు చైతన్యపురిలోని రోడ్డుపై మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో పోలీస్ నిర్బంధాన్ని ఛేదించి ప్లకార్డులు చేతబూని యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ దమనకాండపై ధ్వజమెత్తింది. రోడ్లపైకి వచ్చిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు వ్యాన్లలో స్టేషన్లకు తరలించి నిర్బంధం కొనసాగించారు. అయినా విడతల వారీగా రోడ్లపైకి వచ్చి సర్కార్ వైఖరిపై నిరసన గళం విప్పారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు సంస్థలు, హాస్టళ్ల వద్ద హెచ్చరికలు చేసిన పోలీసులు తాజాగా దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్, చైతన్యపురి ప్రాంతాల్లో డీసీఎంలో పోలీసులు ఉదయం నుంచే పహారా కాశారు.
జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రతి కాలనీ వీధి వద్ద పోలీసులు మోహరించి మరీ రోడ్లపైకి నిరుద్యోగులు రాకుండా అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. అయినా నిరుద్యోగులు రోడ్లపైకి నినాదాలు చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపించారు. చైతన్యపురిలో ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద సంఖ్యంలో విద్యార్థులు చేరి నినాదాలు చేయడంతో పోలీసులు మూకుమ్మడిగా వారిని అరెస్టు చేశారు. తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు భూక్య కుమార్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుడు ఇంద్రకుమార్నాయక్, వినాయక్ కుమార్‌తోపాటు శంకర్, ఆకాశ్, శింబు, అశోక్, ఆస్మా, వినయ్, మహేందర్, భారత్, సోమేశ్యాదవ్ నేతృత్వంలో చైతన్యపురి చౌరస్తా ప్రాంతానికి సుమారు 300 మంది నిరుద్యోగ విద్యార్థులు ఒక్కసారిగా చేరుకొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలంటూ వారు డిమాండ్ చేశారు. జీవో 46, 29ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. చైతన్యపురి పోలీసులు నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మిగతా యువతను చెదరగొట్టారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళన
దిల్సుఖ్నగర్ ప్రాంతంలోనూ నిరుద్యోగ యువత విడదల వారీగా ఆందోళనకు దిగారు. పోలీసులు పకడ్బందీగా నిరుద్యోగులు గుమిగూడకుండా కట్టడి చేయడంతో గ్రూపులుగా విడిపోయి దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ మొండివైఖరి నశించాలని, మ్యానిఫెస్టో హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలిచ్చే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఓ నిరుద్యోగ విద్యార్థిని రెండు చేతుల్లో ప్లకార్డులను పట్టుకొని దిల్సుఖ్నగర్ నడిరోడ్డుపై ఉన్న డివైడర్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డివైడర్‌పై అటూ, ఇటూ పరుగెడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేసి వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నాయకులు బంజపల్లి సుధారాణి, హేమ, రమ్యగౌడ్ కూడా విద్యార్థుల ర్యాలీకి సంఘీభావంగా దిల్సుఖ్నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి నాయకులు సోమేశ్జాదవ్, ఆకాశ్, శంకర్, శింభు, సురేశ్ రాథోడ్, భరత్కుమార్తోపాటుగా విద్యార్థులు మూకుమ్మడిగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇది నిర్బంధ పాలన
ఇది ప్రజాపాలన కాదు. నిరంకుశ, నిర్బంధ పాలన. మ్యానిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మబలికి తీరా గద్దెనెక్కాక అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకోవడమే కాకుండా, ఇచ్చిన ఉద్యోగాలు ఇవీ అంటూ ఒక్కో మంత్రి.. ఒక్కో రీతిలో అబద్ధాలు అడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేవరకు, ఉద్యోగాలు వచ్చేవరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకూ మేం అలసిపోము. మా పోరాటం ఆపబోము. – భూక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు