కారేపల్లి, జూలై 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు. మాదారం బుడిగ జంగాల కాలనీకి చెందిన తూరపాటి రాజు బైక్‌పై గ్రామాల్లో తిరుగుతూ గ్యాస్ స్టవ్‌ల రిపేర్ పని చేస్తుంటాడు. శనివారం పాల్వంచ వైపు పని నిమిత్తం వెళ్లాడు. లక్ష్మిదేవిపల్లి భద్రాచలం రహదారి సోములగూడెం వద్ద వర్షానికి అదుపుతప్పిన మోటర్ సైకిల్ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో రాజు రోడ్డుపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్య రమణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంచారజాతికి చెందిన రాజు కుటుంబం అతడిపైనే ఆధారపడి జీవిస్తుంది. రాజు మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్ధితికి వెళ్లింది.