తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో సాహితీ సంబురాలు జరిగాయి. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలపై కవులు కవితా గానం చేశారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సత్కరించారు. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కవులు కీలక పాత్ర పోషించారని వక్తలు పేర్కొన్నారు. నాడు కవులు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్, రెండు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ) / ఖమ్మం కల్చరల్
ఖమ్మం కల్చరల్, జూన్ 11 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని లకారం ట్యాక్ బండ్పై సాహితీ సంబురాన్ని అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిదేళ్లలో జరిగిన రాష్ర్టాభివృద్ధి, ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను వర్ణిస్తూ కవులు, కళాకారులు తమ అక్షరాలకు పదునుపెట్టారు. తీరొక్క విధంగా వర్ణిస్తూ కార్యక్రమాన్ని, కవి సమ్మేళనాన్ని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ కవులు, రచయితలు తమ సాహితీ ప్రక్రియలతో సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. రచనా పటిమతోపాటు భాషా వికాసానికి వీరు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను చాటే విషయంలో కవుల రచనలు ప్రత్యేక సాధనాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు తమ రచనలతో ఎంతో చైతన్యాన్ని రగిలించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నదని అన్నారు.
డీఈవో సోమశేఖర శర్మ మాట్లాడుతూ జిల్లా కవులు, కళాకారులకు నిలయమని, ఇక్కడి నుంచి ఎందరో సాహితీవేత్తలు రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు. సమ్మేళనంలో సుమారు వంద మంది కవులు పాల్గొని సాహితీ సంపదను పంచారని ప్రశంసించారు. సాహిత్యంలో అపార అనుభవం గడించిన, పలు అవార్డుల గ్రహీత, సాహితీ లబ్దప్రతిష్టుడు మాటేటి శ్రీరామారావు తన కవితలతో తెలంగాణ అభివృద్ధి, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత, సంస్కరణలను చాటి చెప్పడంతో పలువురు ఆయనను అభినందించారు. అలాగే పలువురు కవులు తమ రచనా పటిమ, సృజనను ఎలుగెత్తి చాటారు. సమ్మేళనంలో ఉత్తమంగా ఎంపికైన 5 పద్య, 5 వచన కవితలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు సమ్మేళనం కన్వీనర్, కవి ప్రసేన్ తెలిపారు. సమ్మేళనంలో పాల్గొన్న కవులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీపీఆర్వో గౌస్, కన్వీనర్ ప్రసేన్, సుభాషిణి, బుక్ ఫెయిర్ నిర్వాహకుడు చంద్రమోహన్, సాహితీ ప్రియులు, కవులు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.