మధిర, నవంబర్ 9: పదిహేనేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్న మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఆరోపించారు. పైగా తానే నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానంటూ స్టేట్మెంట్లు ఇస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మధిరలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండకుండా నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అనేక నిధులు మంజూరు చేస్తుంటే.. ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్ పాలనపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. మధిరలోనూ బీఆర్ఎస్సే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దొండపాటి వెంకటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, గుర్రం రామారావు, చేబ్రోలు మల్లికార్జునరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, పెంట్యాల పుల్లయ్య, చిత్తారు నాగేశ్వరరావు, చావా వేణు, మంకెన రమేశ్, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు.. : బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు గురువారం స్థానిక ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. తొలుత పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారి జీ.గణేశ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మొత్తం మూడు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మొండితోక లతజయాకర్, శీలం విద్యాలత వెంకటరెడ్డి, బంధం శ్రీనివాసరావు, గుర్రం రామారావు తదితరులు పాల్గొన్నారు.