మధిర, జూన్ 19 : అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తోందని, ప్రజలు వారి మాటలు, ఎత్తులు నమ్మే పరిస్థితిలో లేరని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మధిరలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో 18 నెలల పాలన పూర్తయినా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే రైతుబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను ప్రారంభించడానికి డిప్యూటీ సీఎంకు సమయం ఉంది కానీ.. పూర్తయిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడానికి ఎందుకు సమయం లేదో చెప్పాలన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతీ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. మధిరలో ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ట్యాంక్ బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దితే.. నిర్వహణ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా తయారైందన్నారు.
మధిర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించిందని, అయితే దీనిపై ప్రజలకు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విమర్శలకు తావు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు బొగ్గుల భాస్కర్‌రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, రైతుబంధు మాజీ కన్వీనర్ చావా వేణు, యన్నంశెట్టి అప్పారావు, ఉమామహేశ్వరరెడ్డి, కోనా నరేందర్‌రెడ్డి, సత్యంబాబు, ఖురేష్, లంకెమల్ల నాగేశ్వరరావు, కొత్తపల్లి నరసింహారావు, జగన్మోహన్రావు, ముత్తారు ప్యారీ తదితరులు పాల్గొన్నారు.