మధిర, ఫిబ్రవరి 21: విద్యుత్ సరిగా లేక, యాసంగి సాగుకు నీరందక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. చింతకాని మండలం లచ్చగూడెంలో సాగునీరందక ఎండిపోతున్న పంటలను చూసి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు ఎల్లయ్య కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు.
అనంతరం రైతు సాగు చేసిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమల్రాజు మాట్లాడుతూ రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచారని, రైతుబీమా, పెట్టుబడి సాయం, 24 గంటల విద్యుత్, పుష్కలంగా సాగునీరు అందించి రైతును రాజు చేశారని గుర్తు చేశారు.
రైతుల పంటలు ఎండిపోతున్నా నీరు అందించాలనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించి.. మృతిచెందిన కౌలు రైతు ఎల్లయ్య కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, మాజీ మండల ఉపాధ్యక్షుడు గురిజాల హనుమంతరావు, మంకెన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటరామారావు, గడ్డం శ్రీనివాసరావు, మండల నాయకులు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.