మధిర (చింతకాని), ఏప్రిల్ 10: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులు తరలిరావాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం లచ్చగూడెం గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వారి విధానాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు.
బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని కోరారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జిల్లా నాయకులు మంకెన రమేశ్, కార్యదర్శి గడ్డం వెంకటరామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, గడ్డం శ్రీనివాసరావు, గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.