మధిర, జనవరి 5: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మధిర మున్సిపాలిటీపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ మాజీ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మధిర పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శివాలయం మాజీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 తర్వాత మధిర మున్సిపాలిటీలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
70 శాతం సిమెంట్ రోడ్లను పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, అయితే రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమారకు సమయం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కంటే రాజకీయాలే ముఖ్యమా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక రూపాయి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించాలని కోరారు. మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, అరిగి శ్రీనివాసరావు, ఎన్నంశెట్టి అప్పారావు, ధరావత్ మాధవి, చావా వేణు బాబు, భువనగిరి నారాయణరావు, ఉమామహేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఆళ్ల నాగబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.