మధిర, జనవరి 23 : ఎన్నికల హామీలు విస్మరించిన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. మధిర పట్టణంలోని 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిన హామీలను వివరిస్తూ.. వాటి పేరుతో ముద్రించిన బాకీ కార్డులను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులను కార్డులో ముద్రించిన అంశాలపై ప్రశ్నించాలని సూచించారు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు. ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సిమెంట్ నాణ్యతగా ఉన్న రోడ్లను ఎందుకు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా మధిరలో జరిగిన ప్రతీ అభివృద్ధి పనిపై కేసీఆర్ ముద్ర కనిపిస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు రావూరి శ్రీనివాసరావు, పల్లబోతుల వెంకటేశ్వర్లు, అరిగా శ్రీనివాసరావు, యన్నంశెట్టి అప్పారావు, బికి కృష్ణప్రసాద్, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.