– సమ్మెకు సంపూర్ణ మద్దతు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 24 : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. శుక్రవారం రోజు వరంగల్ క్రాస్ రోడ్డు కార్ల షోరూం దగ్గర జిల్లా కమిటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ జేడ్పిటిసి సభ్యులు పెరుమాళ్ళపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోకుండా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇప్పటికే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని ఆటో మొబైల్ షోరూమ్స్ దగ్గర మే డే జెండాలు ఎగురవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బీమనపల్లి నాగ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బూసిపోగు వెంకటేశ్వరరావు, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ప్రకాష్, గుగ్గిల వీరబాబు, శ్రీకాంత్, నరేష్, గోవర్ధన్, వసంత బాబు, గోపినాథ్, శేఖర్ పాల్గొన్నారు.