భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ, వార్డు సభల నిర్వహణపై పంచాయతీరాజ్ నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మంగళవారం ఖమ్మం ఐడీవోసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ఇందుకోసం పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
27వ తేదీ వరకు అన్ని గృహాలకు ప్రజాపాలన దరఖాస్తులు అందజేయాలన్నారు. లబ్ధిదారులు ముందుగానే దరఖాస్తును పూర్తిచేసి గ్రామ/వార్డు సభకు వచ్చేలా చూడాలని చెప్పారు. దరఖాస్తు నింపేందుకు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటర్లలో మహిళలు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఖమ్మం స్థానిక సంస్థల కలెక్టర్ సత్యప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, కొత్తగూడెం అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూధన్ రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.