ఖమ్మం సిటీ, జనవరి 25: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలులేని దేశంగా మార్చాలని చూస్తోందని బీఆర్టీయూ నేత ఎండీ వై.పాషా విమర్శించారు. దీనికి నిరసనగా కేంద్ర, రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఐటీయూ, ఐఎన్టీయూసీ, టీయూసీఐ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల జిల్లా నాయకులు తుమ్మా విష్ణువర్ధన్, జీ రామయ్య, కల్యాణం వెంకటేశ్వరరావుతో కలిసి పాషా మాట్లాడారు.
విద్యుత్ సవరణ చట్టం- 2025, వీబీ జీ రామ్ జీ, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వందశాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించడం వంటి నాలుగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కార్మికుల్ని నిరాయుధులుగా మార్చి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు దేశ సంపదను బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వాలన్నదే బీజేపీ ప్రభుత్వ వైఖరిగా స్పష్టం అవుతోందన్నారు.
దీనిలో భాగంగానే వీరోచితంగా పోరాడి, ఎన్నో ప్రాణత్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని విమర్శించారు. వాటి స్థానంలోనే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని దుయ్యబట్టారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు అన్ని కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు అన్నివర్గాల ప్రజలు మద్దతు పలికి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు సత్తార్, మోటే కుమార్, స్వామి, ఎండీ ఫజల్, కొయ్యల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.