ఖమ్మం, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్‌తోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లలో ఖమ్మానికి కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్న ఓ సన్నాసి.. ‘2014కు ముందు ఖమ్మం ఎలా ఉండేదో. 2023 నాటికి ఎలా అయింది? తెలుసుకోవాలని సూచించారు. ఖమ్మాన్ని కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడి ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అతడి సీటుకు ఎసరు పెడతారన్న భయంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. వీళ్ల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని రేవంత్ తన మనవడి మీద ఒట్టు వేసి చెప్పగలడా? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలోని వేలాదిమంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది వాస్తవమో కాదో లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్పే దమ్ము రేవంత్‌కు ఉందా?’ అని ప్రశ్నించారు. 50 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి 50 పైసలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. హామీలు అమలుచేయడం రేవంత్ వల్ల కాదని, చర్చకు వచ్చే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
ఏపీ మంత్రి లోకేశ్‌ను తాను కలవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘అయినా రేవంత్ లాంటి అంతర్రాష్ట్ర దొంగ లోకేశ్ కాదు కదా’ అని కేటీఆర్ అన్నారు. ‘లోకేశ్ ఏమైనా దావూద్ ఇబ్రహీమా? లేదంటే గూండానా?, నీ పెద్ద బాస్ కొడుకే కదా?’ అని అన్నారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే దానిని తనకు అంటగట్టి శవాల మీద పేలాలు ఏరుకుతింటున్న దౌ ర్భాగ్యుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. దమ్ముంటే ఆధారం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి లాగా తాను చీకట్లో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోలేదని విమర్శించారు.
‘ఎవరైనా.. పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్ నాయకులను కలుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు’ అంటూ సీఎం వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఆంధ్రా ప్రభుత్వం పెట్టిన మీటింగ్‌కు వెళ్లేది లేదని, చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం వింటుందని మొన్నటి ఢిల్లీ మీటింగ్ (తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం)కు 48 గంటల ముందు డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి.. ఆ తరువాత 24 గంటలు గడవకముందే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఆ తరువాత ఆ సమావేశంలోనూ పాల్గొన్నారని అన్నారు. అయితే ఆ మీటింగ్‌లో బనకచర్ల గురించి మాట్లాడలేదని రేవంత్‌రెడ్డి అంటే.. మొట్టమొదటి అంశం బనకచర్లేనని ఏపీ మంత్రి రామానాయుడు చెప్పారని గుర్తుచేశారు.
30 రోజుల్లో కమిటీ వేస్తామని, చంద్రబాబు డైరెక్షన్‌కు రేవంత్‌రెడ్డి ఓకే అన్నాడని కూడా ఆ మంత్రి చెప్పారన్నారు. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో చంద్రబాబుకి తాకట్టుపెట్టి రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని స్పష్టం చేశారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌తో చిట్‌చాట్‌లో అడ్డమైన చెత్తంతా వాగారని విమర్శించారు.
కాళేశ్వరంతో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు వేయించిన కేసులను ఉపసంహరించుకుంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రేవంత్ నోరు తెరిస్తే డ్రైనేజ్ కంటే ఎకువ కంపు వస్తోందని విమర్శించారు. ఆయన ప్రెస్మీట్లు, చిట్‌చాట్‌లకు రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రైతు ఇంటికి వెళ్లినా సీఎం రేవంత్‌రెడ్డి బతుకేందో చెబుతారని విమర్శించారు. తాను ఏ చాలెంజ్కైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ పనుల్లో, కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకు ఇస్తానన్నాడు. కనీసం కొడంగల్‌లో అయినా ఇచ్చాడా? మంత్రివర్గంలో 42 శాతం బీసీలు ఉన్నారా? తన చేతుల్లో ఉన్న ఏ పనీ చేయకుండా కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్లను మాత్రం అమలుచేస్తానని అబద్ధం ఆడుతున్నాడు’ అంటూ దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఈశ్వరయ్యగౌడ్ చెప్పారని గుర్తుచేశారు. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంటవీరయ్య, జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్ చేస్తున్న మోసాన్ని బీసీలు అర్థం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ జపం చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్స్థాయి గానీ, ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవంగానీ రేవంత్‌కు ఈ జన్మలో రావని స్పష్టం చేశారు. ‘అతడు చేసిన అభివృద్ధి వల్ల వీసమెత్తు ప్రయోజనం పొందిన ఏ ఒక్కరినైనా సీఎం రేవంత్‌రెడ్డి చూపించగలరా?’ అని ప్రశ్నించారు. థర్డ్ రేట్ యూట్యూబ్ చానళ్లకు, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరిగిందేమోగానీ రాష్ట్ర ప్రజలకు దమ్మిడి లాభం కూడా కలగలేదని అన్నారు. చిట్‌చాట్‌ల పేరుతో రేవంత్ చీటింగ్ చేస్తున్నాడని, అందుకే జనం చీ కొడుతున్నారని విమర్శించారు.
‘హామీల అమలుపై ప్రశ్నించడాన్ని వదిలేద్దామా? రైతులకు ఇస్తానన్న బోనస్‌ను, ఆడబిడ్డలకు ఇస్తానన్న తులం బంగారాన్ని అడగడం మానేద్దామా?’ అని రాష్ట్ర ప్రజలను కేటీఆర్ అడిగారు. ‘రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో, మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడిస్తాడో, వడ్ల బోనస్ ఎంత ఇచ్చాడో, రైతుభరోసా రూ.15 వేలు అని చెప్పి రూ.12 వేలే ఎందుకిస్తున్నాడో, ఆడ పిల్లలకు సూటీలు ఎప్పుడిస్తాడో, వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఎప్పుడిస్తాడో చెప్పే దమ్ము రేవంత్‌కు ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి పొంగులేటికి రూ.4 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. పొంగులేటి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి ఏడాది దాటినా ఇప్పటిదాకా అటు ఈడీ వాళ్లుగానీ, ఇటు పొంగులేటిగానీ మాట్లాడకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్‌గాంధీకి పంపుతున్న రేవంత్.. తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద మిగిల్చాడని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్టిండియా కంపెనీని విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం పనులు, మంత్రి పొంగులేటి కంపెనీకి సగం పనులు అప్పగించి కాంటాక్ట్ కట్టబెట్టారని ధ్వజమెత్తారు.