మధిర, నవంబర్ 13: ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో సాధులూరి ఇశ్రాయేలు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదవాశాత్తు షాపులో మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అవి అదుపులోకి రాలేదు. దీంతో దుకానంలో ఉన్న సామాగ్రి అంతా కాలిపోయింది. జీవనోపాధి కోసం చిల్లర వ్యాపారం చేసుకుంటున్నానని, అదికాస్తా తగలబడటంతో తానేమి చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.