భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 31 : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెండ్రోజులుగా ఆగకుండా భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రంతా వదలకుండా వాన పడడంతో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. రెండు జిల్లాల్లో శనివారం రోజంతా ముసురుకుంది.
భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందు, భద్రాచలం, చర్ల తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. మూడు గేట్లు ఎత్తి నీరు దిగువకు వదిలారు. రాత్రికి వరద పెరిగితే మళ్లీ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. చర్ల మండలం తాలిపేరులో 39 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. 12 గేట్లు తీయడంతో భారీగా వరద కింది ప్రాంతాలకు ప్రవహిస్తున్నది.
రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వానకు జనజీవనం స్తంభించింది. వ్యాపారులు సముదాయాలను మూసివేసుకున్నారు. నిరంతరాయంగా వర్షం కురవడంతో దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు ఇండ్లకే పరిమితమయ్యారు. విద్యాసంస్థలకు సెలవు ఇవ్వకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు తడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లారు.
మరో నాలుగు రోజులు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చేపల వేటకు, వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. రహదారులపై వాగులు పొంగినప్పుడు దాటవద్దని సూచించారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూంతోపాటు 24 గంటలు పర్యవేక్షణ నిమిత్తం 18 మంది సిబ్బందిని కేటాయించారు. 08744-241950 నంబర్ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఖమ్మం నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వరి పొలాలు, పత్తి చేలకు వరుణుడు ప్రాణం పోసినైట్లెంది. కాకపోతే పెసర, కొత్తగా వేసిన మిర్చితోట సాగు రైతులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా 64.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మున్నేటిలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతున్నది. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి.
పలుచోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు, ఏన్కూరు, ఖమ్మం టూ బోనకల్ రహదారుల మధ్యలోని రోడ్డుపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ సాగర్ ప్రాజెక్టులకు వరద వచ్చి చేరింది. ప్రధానంగా ఖమ్మం నుంచి బోనకల్లుకు, బోనకల్లు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే మార్గంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించడం వల్ల జగ్గయ్యపేట-బోనకల్లు, బోనకల్లు-ఖమ్మం రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బేతుపల్లి పెద్దచెరువు, మధిర చెరువు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు పూర్తి జలకళను సంతరించుకున్నాయి. బోనకల్, వేంసూరు మండలాల్లో చెరువులు అలుగు దశకు చేరుకున్నాయి. పక్షం రోజుల తర్వాత వరుణుడు కరుణించడంతో పునాస, పత్తి పంటలు ప్రాణం పోసుకుంటున్నాయి.
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే 7901298265 నెంబర్‌కి కాల్ చేయాలని సూచించారు.
చర్ల, ఆగస్టు 31 : ఎగువ ప్రాంతం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షానికి తాలిపేరు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో శనివారం 22 గేట్లు తెరిచి 54,284 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఏడు గేట్లు పూర్తిగా.. 15 గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 74 మీటర్లు కాగా.. ప్రస్తుతం 71.62 మీటర్లుగా ఉంది.
ఖమ్మం, ఆగస్టు 31 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
మణుగూరు టౌన్/సత్తుపల్లి టౌన్, ఆగస్టు 31 : మణుగూరు, సత్తుపల్లి మండలాల్లోని సింగరేణి ప్రాంతంలో శనివారం బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. మణుగూరు ఓసీ-4లో భారీఎత్తున నీరు నిలవడంతో నీటి మళ్లింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జలగం వెంగళరావు ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతోపాటు, 1,40,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే పనులకు, కిష్టారంలో ఓసీలో 5 టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 25 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారి నరసింహారావు తెలిపారు.