ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 29: టెన్త్ ఫలితాల్లో 95.12 శాతంతో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఇతర జిల్లాల్లో కంటే గతంలో ఖమ్మం జిల్లా టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణతతో అత్యున్నత స్థానంలో నిలిచేది. ఫలితాలు ఏవైనా హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లానే ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచేది. మూడేళ్ల క్రితం వరకూ కూడా ఒక్కసారి మినహా ఎక్కువ దఫాలు పదిహేనులోపు స్థానాల్లోనే నిలిచింది. కానీ, గత మూడేళ్లుగా కాంగ్రెస్ పాలనలో టెన్త్ ఫలితాల ఉత్తీర్ణత శాతం మిగతా జిల్లాలకంటే దిగజారుతోంది.
ఈ దఫా ఏకంగా 25వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా సరైన పర్యవేక్షణ, దిశానిర్దేశం లేకపోవడంతో ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. కీలకమైన మంత్రులున్నప్పటికీ టెన్త్ ఫలితాల్లో జిల్లాను అత్యత్తమ స్థానంలో నిలపలేకపోయారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 16,958 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో బాలురు 8,737 మంది, బాలికలు 8,221 మంది పరీక్షలు రాశారు.
ఇందులో బాలురలో 8,201 మంది పాసై 93.87 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బాలికల్లో 7,930 మంది పాసై 96.46 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం 16,131 మంది పాసై 95.12 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాష్ట సగటు 95.15 శాతం ఉత్తీర్ణతతో పోలిస్తే జిల్లా ఉత్తీర్ణత 0.03 శాతం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏ ఫలితాల్లోనైనా ఏటా బాలికలే పైచేయి సాధిస్తూ వచ్చారు. ఈ దఫా కూడా టెన్త్ ఫలితాల్లో జిల్లా విద్యార్థినులే మూడు శాతం ఎక్కువ ఉత్తీర్ణతతో రాణించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెన్త్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ప్రతిభకనబర్చారు. మొత్తం 1,445 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 1,413 మంది విద్యార్థులు పాసై 97.72 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలల్లో 14 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థులను రాష్ట్ర సెక్రటరీ బీ.సైదులు, ప్రాంతీయ సమన్వయాధికారి సీహెచ్ రాంబాబు అభినందించారు.
జిల్లాలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. ఖమ్మం నగరానికి చెందిన కుంచాల వృతికా కృష్ణ శ్రీచైతన్య పాఠశాలలో చదువుతూ 597తో టాపర్‌గా నిలిచారు. తర్వాత స్థానాల్లో 595, 593, 592, 591 వంటి మార్కులతో విద్యార్థులు రాణించారు.
టెన్త్ ఫలితాల్లో ఈసారి గ్రేడులతోపాటు మార్కులను కూడా ప్రకటించారు. ఇంటర్నల్స్‌కు 20 మార్కులు కాగా.. మిగిలిన 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఫలితాల విడుదలలో ఇంటర్నల్, వార్షిక పరీక్షల మార్కులు కలిపి.. మార్కులు, గ్రేడ్లను పొందుపరిచారు.
కొత్తగూడెం గటేశ్టెంపుల్, ఏప్రిల్ 29: టెన్త్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా 90.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో నాగలక్ష్మి తెలిపారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 6,192 మంది బాలురు, 6,511 మంది బాలికలు కలిపి మొత్తం 12,703 మంది పరీక్షలు రాశారు. వారిలో 5,502 మంది బాలురు, 6,004 మంది బాలికలు కలిపి మొత్తం 11,506 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 88.86 శాతం, బాలికలు 92.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 90.58 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 302 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 68 పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 42 ప్రభుత్వ పాఠశాలలు, 26 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
