ఖమ్మం, జూలై 26: నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు కుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 103 చెరువులు బుధవారం నాటికి మత్తడి దుంకుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే విధంగా వాన కురిస్తే మిగిలిన చెరువులు కూడా అలుగులు పోసే అవకాశం ఉంది. దీంతో వాటి ఆయకట్టు కింది రైతులకు వానకాలం పంటలకే కాకుండా యాసంగి పంటలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీంతో అన్నదాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. దీంతో బోర్ల కింద పంటల సాగుకు కూడా ఇబ్బందులు ఉండవు.
ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలోని మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే చెరువులను పునరుద్ధరించినందున వాటిల్లో నిల్వ సామర్థ్యం పెరిగింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,409 చెరువులుండగా వీటిల్లో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు 983 మాత్రమే ఉన్నవి. వీటిల్లో 103 చెరువులు ప్రస్తుతం మత్తడి పోస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఇంకో 270 చెరువులు మత్తడి దుంకే అవకాశం ఉంది. బుధవారం నాటికి నియోజకవర్గాల వారీగా ఎన్ని చెరువులు ఎంత శాతం నిండాయోనన్న వివరాలు ఇలా ఉన్నాయి.