నాడు.. : బీటలువారిన బీడు భూములు.. ఎండిపోయిన బోర్లు, బావులు, చెరువులతో తడారిన గొంతులెన్నో.. వచ్చిపోయే కరెంట్.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. పొలానికి నీరందించేం దుకు వెళ్లిన కర్షకులు విద్యుత్ షాక్‌తో, పాముకాటుతో బలైన ఘటనలు నేటికీ కళ్లముందే కదలాడుతున్నాయి. అరకొర పింఛన్‌తో బతుకీడ్చిన బడుగు జీవులెందరో.. చేతి, కుల వృత్తులు అటకెక్కాయి. రాయితీ పథకాల ఊసేలేదు.. బక్కచిక్కిన రైతుకు రుణమాఫీ అందని ద్రాక్షే. తాగునీటికి గోస పడిన రోజులు గుర్తుకొస్తే గుండె చెరువు అవుతుంది. గత పాలకుల ఏలుబడిలో ప్రజల కష్టాలు తలుచుకుంటే కన్నీరు ఉబికి వస్తుంది. తమ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు. తమ పార్టీ నాయకులకే అభివృద్ధి ఫలాలు..
నేడు : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టాక అభివృద్ధి, సంక్షేమం జోడెడల్లా పరుగులు తీస్తున్నది. రాష్ట్రంలో ఏ జిల్లాకెళ్లినా.. ఏ ప్రాంతానికెళ్లినా.. పార్టీలకతీతంగా పథకాలు అమలు అవుతున్నాయి. సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిల్లిపాదికి ఏదో పథకాన్ని చేరువ చేసింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ‘ఆసరా’తో భరోసా కల్పిస్తున్నది. రైతుబంధు, రైతుబీమాతో కర్షకుల్లో ధీమా నెలకొంది. దళితబంధుతో దళితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడపడుచులకు అండగా నిలిచింది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో అన్నదాతలు రెండు పంటలు పండిస్తున్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించింది. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి చెప్పుకుంటూ పోతే అది ఒడవని ముచ్చటే.. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ పథకాలతో లబ్ధిపొందుతున్నారు. పథకాలు లబ్ధి పొందేందుకు కుల, మత, రాజకీయ, వర్గ భేదాలేమీ లేవు. అర్హులైతే చాలు పక్కాగా వారికి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి..
& సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతున్న రాష్ట్రంలో ఎందుకీ రైతు ‘సంఘర్షణ’. ఎందుకీ ఆత్మవంచన? ప్రశాంతంగా ఉన్న పల్లెలు, పట్నాల్లో సభలు, యా త్రల పేరుతో ప్రజల్లో కల్లోలం సృష్టించడం సమంజసమేనా..? అన్ని పథ కాలు అమలు అవుతున్న తెలంగాణలో అవసరమా? సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? నీళ్లు, నిధులు, నియామకాలు జరిగేవా? అసలు సంక్షేమ పథకాలు అమలు సాధ్యమయ్యేదా? ప్రజలారా ఒక్కసారి ఆలోచిం చండి.. ఎవరు ప్రజలకు అండగా నిలిచారో.. పథకాల దండ వేశారో అవగతం చేసుకోండి. సభలు, యాత్రల పేరుతో వచ్చేవారిని నిలదీయండి నిగ్గదీసి అడగండి.? కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలు అమలు చేయమని సవాల్ విసరండి
ఖమ్మం, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో ప్రజలకు దూరమైన సంక్షేమం నేడు సబ్బండవర్గాలకు చేరువైంది. నెర్రెలుబారిన నేలలు సస్యశ్యామలమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నది. ఉమ్మడి పాలనలో అప్పటి నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. సంక్షేమం పథకాల అమలులో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి చూపేవారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారు. పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగా చెరువులు బలోపేతమయ్యాయి. చెరువుకట్టల నిర్మాణం సాధ్యమైంది. దీంతో భూగర్భజాలాలు పెరిగాయి. పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయి. రైతురుణమాఫీ పథకం ద్వారా రూ.లక్షలోపు రుణం తీసుకున్న 17వేల మంది రైతులు రుణవిముక్తులయ్యారు. వీరిలో అన్ని పార్టీలకు చెందిన రైతులూ ఉన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఖమ్మం జిల్లావ్యాప్తంగా 3 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరి బ్యాంకు ఖాతాల్లో సీజన్‌కు సుమారు రూ.350 కోట్లు జమ చేస్తున్నది.
భద్రాద్రి జిల్లాలో రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ..1,507 కోట్లు జమ చేసింది. యాసంగిలో 1,40,931 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.214 కోట్లు జమ చేసింది. రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే ఎన్నో కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది. ఈ రెండు పథకాలూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అమలవుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు వేసవిలో కరెంట్ కోతలతో అల్లాడిపోయేవారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇప్పుడు ఆ బాధలు తప్పాయి. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతున్నది. ఇంటి కనెక్షన్లకు ఇదే రీతిన విద్యుత్ సరఫరా అవుతున్నది.
వేలాది కుటుంబాలకు ‘ఆసరా’
కాంగ్రెస్ పాలనలో రూ.200కు పరిమితమైన పింఛన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రూ.2,016 చేసింది. గతంలో దివ్యాంగులకు రూ.500 ఉన్న పింఛను ఇప్పుడు రూ.3,016కు పెరిగింది. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లిళ్లకు రూ.1,00,116 కానుకగా అందిస్తున్నది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలలూ బలోపేతం అయ్యాయి. సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రసవం తర్వాత వైద్యసిబ్బంది బాలింతలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు. గర్భిణి నాటి నుంచి ప్రసవం వరకు వారి ఖాతాల్లో ప్రభుత్వం రూ.12 వేలు- రూ.13 వేల వరకు జమ చేస్తున్నది. విదేశి విద్యను నిరుపేద విద్యార్థుల దరిచేర్చేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తున్నది.
కుల వృత్తులకు పూర్వవైభవం
తెలంగాణ వచ్చాక కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొచ్చారు. జీవాల పెంపకందారులకు 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేశారు. మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేశారు. చేపల విక్రయం కోసం మత్స్యకారులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు, వ్యాన్లను అందజేసింది. గీత కార్మికుల పన్ను రద్దు చేయడంతో పాటు బీమా పరిహారం రూ.6లక్షలకు పెంచింది. ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పాఠశాలల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఇలా సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గతంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే పరిమతమైన పథకాలు నేడు ప్రతిఒక్కరికీ అందుతున్నాయి.
సీఎం కేసీఆర్ పెద్ద దిక్కయ్యాడు..
మాకు ఇద్దరు అమ్మాయిలు నవ్య, కావ్య. బంగారం తాకట్టు పెట్టి, కొంత అప్పు చేసి వారి వివాహాలు చేశాం. అప్పులకు వడ్డీలు ఎక్కు వయ్యాయి. ఈలోపు చేస్తున్న వ్యాపారం దెబ్బతిన్నది. బంధువుల నుంచి సహకారం అంతంతమాత్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టేక్కితే చాలు అనుకున్నాం. అలాంటి సమయంలో కల్యాణలక్ష్మి చెక్కు అందింది. అప్పులు తీర్చాం. ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాం. మరికొద్దిరోజుల్లోనే మరో అమ్మాయి కల్యాణలక్ష్మి చెక్కు అందింది. సీఎం కేసీఆర్ పెద్ద దిక్కు అయి రెండు చెక్కులు పంపించాడని అనిపించింది. నిరుపేదలను ఆదుకోవడానికి ఆయన మంచి పథకాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్ పదికాలాల పాటు చల్లగా ఉండాలి. ఇటీవల మేం అనారోగ్యానికి గురైతే ఎమ్మెల్యే రేగా కాంతారావు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.75 వేలు మంజూరు చేయించారు.
– మద్ది వెంకటరెడ్డి, శ్రీదేవి దంపతులు, మణుగూరు
‘మన ఊరు- మన బడి’ భేష్..
ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మనఊరు- మన బడి’ పథకం భేష్. పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు బాగుపడతాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వం గురుకులాలను బలోపేతం చేసింది. విద్యారంగంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలు వేసింది.
– బంధం వెంకన్న, పీఆర్టీయూ మండల కార్యదర్శి, బోనకల్లు
కష్టకాలంలో రైతుబీమా భరోసానిచ్చింది..
మాకు రెండకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుని జీవిస్తాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాం. చిన్నమ్మాయి దివ్యాంగురాలు. నా భర్త నాగేశ్వరరావు గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటికే మాకు రూ.4 లక్షల అప్పు ఉంది. వృద్ధులైన అత్తమామల సంరక్షణ మాపైనే పడింది. ఇలాంటి కష్టకాలంలో మాకు రైతుబీమా రూ.5 లక్షలు అందాయి. వెంటనే అప్పులు తీర్చేశాను. మిగిలిన లక్షతో కుటుంబ పోషణ సాగిస్తున్నాం. చిన్నమ్మాయికి దివ్యాంగురాలి పింఛను, మామయ్యకు వృద్ధాప్య పింఛను అందుతున్నది. సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం మంచి పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– గంగారపు నర్సమ్మ, కోయగూడెం, టేకులపల్లి మండలం
కాంగ్రెస్ కుటుంబాలకూ సంక్షేమ పథకాలు
అశ్వారావుపేట, మే 5: తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలవుతున్నాయి. కాంగ్రెస్ కుటుంబాలకూ సర్కార్ సంక్షేమ పథకాలు అందుకుంటున్నాయి. కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ రాంబాబు కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్నది. తుమ్మ రాంబాబుతో పాటు ఆయన సోదరులు తుమ్మ నాగేశ్వరరావు, తుమ్మ సత్యనారాయణ, తుమ్మ వెంకటేశ్వరావుకు చెందిన 40 ఎకరాలకు సీజన్‌కు రూ.4 లక్షల చొప్పున రైతుబంధు అందుతున్నది. తుమ్మ నాగేశ్వరరావుకు గొర్రెల పథకం యూనిట్ కింద పది గొర్రెలు మంజూరయ్యాయి. వీటిని పెంచుకుంటూ ఆయన కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నది. తల్లి మల్లమ్మ వృద్ధాప్య పింఛను రూ.2,016 నెలనెలా అందుతున్నది.
పింఛన్‌తో ఆసరా..
తెలంగాణ ప్రభుత్వం కుల, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.మా కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, గొర్రెల యూనిట్ల పథకాలన్నీ మా కుటుంబం లబ్ధి పొందుతున్నది.
– తుమ్మ మల్లమ్మ
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు..
ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాల పనితీరును గమనించాను. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. అసలు సంక్షేమ పథకాల ఊసే ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మాకు పది ఎకరాల భూమి ఉంది. ప్రతి సీజన్‌కు రైతుబంధు సాయం అందుతుంది. పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందుతుంది. ఏడాదిలో రెండు పంటలు పండిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాం. మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అయింది.
– మాదిరాజు సామ్రాజ్యలక్ష్మి, రైతు, గంగారం, సత్తుపల్లి మండలం
రుణభారం తగ్గింది..
తెలంగాణను సాధించుకోక పోతే రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలయ్వేవి కావు. రైతుబంధు,రైతుబీమా వంటి పథకాలతో రైతులకు మేలు జరుగుతున్నది. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతులు భరోసాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రుణమాఫీతో ఎంతోమంది రైతులకు రుణభారం తగ్గింది. రైతుల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లుంది. గతంలో రైతులు సమావేశాలు నిర్వహించాలంటే చెట్లు, పందిర్లే దిక్కయ్యాయి. ఇప్పుడు రైతువేదికలు అందుబాటులోకి రావడంతో ఇబ్బందులు తప్పాయి.
– జాబిశెట్టి నర్సయ్య, రైతు, కోయగూడెం
రైతులపాలిట దేవుడు సీఎం కేసీఆర్..
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతుబంధు అమలు చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి సీజన్‌కు ముందే రైతుబంధు అందిస్తున్నది. దీంతో రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు.
– గంగారపు కోటేశ్వరరావు, రైతు, టేకులపల్లి
దివ్యాంగుల పింఛను అందుతున్నది..
గతంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగింది. పనికి వెళ్లే పరిస్థితి లేదు. ఉమ్మడి పాలనలో కేవలం రూ.200 పింఛను వచ్చేది. తెలంగాణ వచ్చిన తర్వాత రూ.3 వేలకు పైగా పింఛను వస్తున్నది. అమ్మానాన్నలకు భారం లేకుండా సర్కారు ఇచ్చిన పెన్షన్‌తో బతుకుతున్నా. తెలంగాణ ప్రభుత్వం నన్ను ఆదుకున్నది.
– బాదావత్ సతీశ్, పింఛనుదారుడు, లక్ష్మీదేవిపల్లి
యలమందలకు చేయూత..
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారు. యలమందలకు సాయం అందిస్తున్నారు. ఉమ్మడి పాలనలో కుల వృత్తులకు ప్రోత్సాహం ఉండేది కాదు. అప్పటి పాలకులకు సోయి ఉండేది కాదు. వాళ్లకి నచ్చిన వాళ్లకే అన్నీ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
– జోయినబోయిన వెంకటేశ్వర్లు, డేగలబడుగు, సుజాతనగర్
ఠంచనుగా పెన్షన్ వస్తున్నది..
రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛను నెలనెలా ఠంచనుగా వస్తున్నది. నాకు కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉండేది. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాడిని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ సరిపోయేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పెన్షన్ పెంచారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల బాధలు అర్థం చేసుకున్న మనిషి కేసీఆర్.
– కూరపాటి గోవింద్, రైటర్‌బస్తీ, గొల్లగూడెం
సాగుకు ఢోకా లేదు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగుకు ఎలాంటి ఢోకా లేదు. పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందుతుంది. నాకున్న ఐదెకరాల్లో ఏటా రెండు పంటలు పండిస్తున్నా. సీజన్‌కు ముందే రైతుబంధు అందుతుండడంతో దర్జాగా సాగు చేసుకుంటున్నా. నాకు వృద్ధాప్య పింఛను వస్తుంది. సంక్షేమ పథకాలతో ప్రజలందరూ బాగున్నారు. మేమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– గొర్లమారి పిచ్చిరెడ్డి, రైతు,కొత్తూరు, సత్తుపల్లి మండలం
కల్యాణలక్ష్మి ఆదుకున్నది..
మేము దశాబ్దాల కిందట పంజాబ్ నుంచి వలస వచ్చాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త విజయ్ సింగ్ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. నాకు ఇద్దరు పిల్లలు. అనిత, కవిత. నేను కమ్మరి పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటాను. పిల్లలు పెళ్లీడుకు వచ్చాక పెండ్లిళ్లు ఎలా చేయాలని మదనపడ్డా. అప్పులు చేసి ఇద్దరి పెండ్లిళ్లు చేశా. ఆ సమయంలో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఎమ్మెల్యే వెంకటవీరయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి చెక్కులు అందజేశారు. అందిన రూ.2 లక్షలతో అప్పులు తీర్చాను. గౌరవంగా ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేశాననే సంతృప్తి మిగిలింది. సీఎం కేసీఆరే ఇద్దరి పిల్లల పెండ్లి చేశాడనుకుని సంతృప్తి చెందా. నాకు ఒంటరి మహిళ పింఛను అందుతున్నది. ఎవరిపై ఆధారపడకుండా పింఛనుతో బతుకుతున్నా. ప్రభుత్వం అడుగడుగునా ఆదుకుంటున్నది.
– దీప్ కౌర్,రాజీవ్‌నగర్, సత్తుపల్లి