ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీఆర్ఎస్ ఉద్భవించింది. బీజేపీ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించేందుకు శ్రేణులకు ఆయుధం లభించింది. తెలంగాణ ఉద్యమంలో పిడికిలి బిగించినట్లుగానే.. ఇక బీజేపీ ముక్ ్తభారత్ కోసం పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన లేఖపై శుక్రవారం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీశ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు కాలుస్తూ సందడి చేశారు. ఒకరికొకరు మిఠాయి తినిపించుకున్నారు. జయహో కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో హోరెత్తింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రేగా కాంతారావు,జడ్పీచైర్మన్లు కోరం, లింగాల తదితరులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సంబురాల్లో పాల్గొన్నారు. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా ఆమోదిస్తూ గురువారం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి లాంఛనంగా పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకేంద్రాలతో పాటు అన్ని నియోజకవర్గకేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. పటాకులు కాలుస్తూ సందడి చేశారు. ఒకరికొకరు మిఠాయి తినిపించుకున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన వేడుకలో సండ్ర వెంకటవీరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వైరా పట్టణంలో నిర్వహించిన సంబురాల్లో మున్సిపల్ చైర్మన్ సుతకాని జయపాల్, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కామేపల్లి మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, ఎంపీపీ బానోత్ సునీత, వేంసూరులో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణంలో జరిగిన వేడుకలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ పాల్గొన్నారు. అలాగే చింతకాని, బోనకల్లు, దుమ్ముగూడెంతో పాటు పలుచోట్ల సంబురాలు జరిగాయి.
కేసీఆర్ మార్గనిర్దేశంలో మున్ముందుకు..
ఉద్యమ సారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గనిర్దేశంలో ముందుకు సాగుతాం. తెలంగాణ మోడల్ స్ఫూర్తితో దేశాన్నీ అదే మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తాం. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చే వరకు శ్రమిస్తాం. మతోన్మాద శక్తులపై నిరంతర పోరు సాగిస్తాం. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తాం. దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే క్రతువులో భాగస్వాములమవుతాం.
– బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
కేసీఆర్‌తోనే సుపరిపాలన..
కేసీఆర్‌తోనే దేశంలో సుపరిపాలన సాధ్యం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలకు చేసిందేమీ లేదు. ఎనిమిదేళ్లుగా బీజేపీ దేశాన్ని పాలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో పేదరికం మరింత పెరిగింది. అసమానతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఆవిర్భావం దేశప్రజలకు ఆశాకిరణం. దేశ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషించి కేసీఆర్ కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తారు. మానవీయ రాజకీయాలను ఆవిష్కరిస్తారు.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
బీఆర్ఎస్ విజన్‌తో నయా భారత్..
బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. నవ శకం ఆరంభమైంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ అమలు చేస్తారు. భారత్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ మున్ముందు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనున్నది. కేసీఆర్ విజన్‌తో నయా భారత్ ఆవిష్కృతం కానున్నది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది. బంగారు భారత్ ఏర్పడుతుంది.
– ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు