భద్రాచలం, మార్చి 9: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈనెల 18న పౌర్ణమిని పురస్కరించుకొని రామయ్యకు వసంతోత్సవం, తలంబ్రాలు కలిపే వేడుకలు జరుగనున్నాయి. వీటితో ఆలయ అధికారులు, అర్చకులు రామయ్య పెండ్లి పనులకు శ్రీకారం చుడతారు. వచ్చే నెల 10న శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని మిథిలా స్టేడియంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహా పట్టాభిషేక వేడుకలు జరుగనున్నాయి. ఆలయ అధికారులు ఈ మేరకు రామయ్య పెండ్లి పనులు ప్రారంభించారు. ఆలయం, అనుబంధ ఆలయాలకు రంగులు వేయిస్తున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా నిర్వహించనున్నారు. భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
శ్రీరామనవమి వేడుకలను వీక్షించేందుకు ఈసారి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే భద్రాచలం, పర్ణశాల ఆలయాల్లో చలువ పందిళ్లు, షామియానా ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. పనులను అప్పగించాం. ప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
– దేవస్థాన ఈవో బానోత్ శివాజీ