టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశాదీపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గురువారం కూడా సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువతీయువకులు, కాంట్రాక్టులు ఉద్యోగులు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కాంట్రాక్టు ఉద్యోగులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -నమస్తే, న్యూస్ నెట్వర్క్