ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 5: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో శనివారం ‘చదువు – ఆనందించు – అభివృద్ధి చెందు (రీడ్)’ అనే కార్యక్రమం ప్రారంభమైంది. వంద రోజుల పాటు కార్యక్రమం కొనసాగనున్నది. విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు కథల పుస్తకాలు పంపిణీ చేయించారు.
కరోనా కారణంగా విద్యార్థులు రెండేళ్ల నుంచి తరగతులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని, దీని ద్వారా చాలామందిలో విద్యపై అనాసక్తి వచ్చిందన్నారు. ఈ అనాసక్తిని దూరం చేసేందుకే ప్రభుత్వం వంద రోజుల పాటు ‘రీడ్’ నిర్వహిస్తున్నది. తొలిరోజు ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళికపై సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్ తల్లాడ, కూసుమంచి మండలాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. కార్యక్రమ అమలు తీరుపై ఆరా తీశారు. తల్లాడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బడి ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి నమస్కరించారు.
కారేపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులు ‘రీడ్’ అక్షర ఆకృతిలో కూర్చున్నారు. కార్యక్రమం ముగిసేలోగా విద్యార్థులు ధారాళంగా చదవగలగుతారని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.